తెలంగాణ సచివాలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారు: ఏప్రిల్ 30న ప్రారంభం
తెలంగాణ సచివాలయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు కొత్త సచివాలయ పనులను కేసీఆర్ పరిశీలించారు.
కొత్త సచివాలయ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలోని పలు బ్లాకులకు వెళ్లి పనులు సీఎం పరిశీలించారు. కొత్త సచివాలయ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయంలో కొన్ని అంశాలపై కేసీఆర్ మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. సీఎం సూచనల మేరకు సచివాలయ నిర్మాణ పనుల్లో మార్పులు చేర్పులను చేయనున్నారు. వచ్చే నెల మొదటి వారం నాటికి కొత్త సచివాలయం పనులు పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు.
also read:తెలంగాణ సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్
ఇదిలా ఉంటే ఏప్రిల్ 14వ తేదీన హైద్రాబాద్ లో అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించనున్నారు. దేశంలోనే అత్యంత పెద్ద విగ్రహన్ని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయిస్తుంది. 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. అంబేద్కర్ జయంతి రోజున ఈ విగ్రహన్ని ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అమరవీరుల స్థూపాన్ని జూన్ రెండో తేదీన ఆవిష్కరించాలని నిర్ణయించారు.
తెలంగాణ సచివాలయం నిర్మాణ పనులకు 2019 జూన్ 27న కేసీఆర్ భూమి పూజ నిర్వహించారు.సుమారు ఏడు లక్షల చదరపు అడుగుల స్థలంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. గత ఏడాది దసరా నాటికే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికీ కూడ పనులు పూర్తి కాలేదు. దీంతో కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త సవివాలయ ప్రారంభం వాయిదా పడింది.
కొత్త సచివాలయం పార్కింగ్ స్థలంలో 300 కార్లు, ఆరు వందల ద్విచక్రవాహనాలు పార్క్ చేసే అవకాశం ఉంది. మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ , రెండు, మూడో అంతస్థుల్లో కన్వెన్షన్లు సెంటర్లు, రెస్టారెంట్లు ఉంటాయి. ఏడో అంతస్థులో సీఎం కేసీఆర్ చాంబర్ ఉంటుంది.