తెలంగాణ మునిసిపల్ ఎన్నికల కోలాహలం మొదలింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా పూర్తయ్యింది. అన్ని పార్టీలు ఇప్పుడు రెబెల్స్ గా నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునే పనిలో నిమగ్నమైంది. అన్ని పార్టీలకన్నా తెరాస లో ఈ రెబెల్స్ లొల్లి ఎక్కువగా ఉంది. ఇతర పార్టీలనుంచి వచ్చి చేరే నేతలకు గేట్లు తెరవడంతో అన్ని పార్టీలకు చెందిన నేతలు వచ్చి తెరాస లో చేరారు.

దీనితో ఇప్పుడు టికెట్స్ పందేరం నడిచింది. దక్కనివారంతా రెబెల్స్ గా నామినేషన్స్ దాఖలు చేసారు. ఇప్పుడు ఆ రెబెల్స్ లిస్టులను పట్టుకొని సంబంధిత ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ భావం కి వస్తున్నారు. ఇక ఈ రెబెల్స్ విషయమై ఇప్పటికే కెసిఆర్, కేటీఆర్ లు చాలాసార్లు మాట్లాడారు. కేటీఆర్ అయితే ఏకంగా రెబెల్స్ ని కడుపులో పెట్టి చూసుకోవాలని ఓపెన్ గానే కామెంట్ చేసారు. కెసిఆర్ కూడా ఎమ్మెల్యేలకు రెబెల్స్ విషయమై వార్నింగ్ కూడా ఇచ్చారు. 

also read మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ఉదయం కాంగ్రెస్ కండువా, సాయంత్రం గులాబీ జెండా

ఇన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నా, విపత్కర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని కనబడుతున్నప్పటికీ, అధికార తెరాస మాత్రం ఇప్పటికి కూడా తమదే గెలుపనే ధీమాను వ్యక్తం చేస్తుంది. దీని వెనకున్న అసలు కారణమేంటో తెలుసుకుందాం. ఈ మునిసిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

అందరికన్నా ఎక్కువగా ఈ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది అధికార తెరాస కు. తెరాస పాలన కు ఈ ఎన్నిక ఒక రెఫరెండం గా చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణాలో తామేదో బలమైన ప్రత్యమనాయంగా ప్రొజెక్ట్ చేస్తున్న బీజేపీ కి షాక్ ఇవ్వాలని కెసిఆర్ భావిస్తున్నాడు. అందుకే మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని, ఒక్క చోట ఓడిపోయినా పదవులు ఊడతాయని మంత్రులకు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.  

దీనితోపాటుగా  రెబెల్స్‌ బరిలో లేకుండా చూసుకోవాలని, పార్టీ గీత దాటితే సీరియస్‌ చర్యలు తప్పవని ఆయన పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారనే వార్తలు మీడియాలో మాత్రం గుప్పుమన్నాయి. తెరాస అధికారంలో ఉండడం వల్ల పోల్ మానేజ్మెంట్ అవకాశాలు మెండుగా ఉండడం, అంగ బలం, అర్థబలం కూడా తోడవడం వల్ల తెరాస లాభపడడం సహజం. ఇది కాకుండా తెరాస కు రాష్ట్రంలో అధికారంలో ఉండడం వల్ల ఇంకో అవకాశం కూడా ఉంది. 

కరెక్ట్ గా ఆలోచిస్తే... అధికార పార్టీగా టీఆర్‌ఎస్‌ కు మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చక్రం తిప్పే ఛాన్స్ ఉంటుంది. చైర్‌పర్సన్‌/మేయర్‌ పదవులు దక్కించుకోవటానికి సరిపోను వార్డులు/డివిజన్లలో గెలవలేకపోతే, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని తెరాసలో  చేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. గతంలో మునిసిపల్ ఎన్నికల్లో ఈ తరహా తతంగాన్ని మనం చాలానే చూసాము.  

also read తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు 2020: టిఆర్ఎస్ కొంపముంచే స్థానాలు ఇవే...

కాకపోతే ఒకింత క్యాంపు రాజకీయాలకు తెరతీయాల్సి ఉంటుంది. ఏ మహారాష్ట్రనో కర్ణాటక లెవెల్ లోనో కాకపోయినా... కనీసం ఒకరిద్దరు పెద్ద నేతలు రంగంలోకి దిగితే సరిపోతుంది. కాకపోతే ఒకింత డబ్బు ఖర్చు అదనం. ఇతర పార్టీల నుంచి గెలిచిన వారికి ఎన్నికల్లో వారు ఖర్చు చేసిన మొత్తంతోపాటు, అదనంగా కొంత చెల్లించాల్సి ఉంటుంది. దానితోపాటు వారు వినిపించే కొన్ని గొంతెమ్మ కోరికలకు కూడా తల ఆడించాల్సి ఉంటుంది. 

అయితే ఇన్ని తలనొప్పుల కన్నా ఎన్నికల్లోనే సర్వ శక్తులను ఒడ్డి చైర్‌పర్సన్‌/మేయర్‌ పదవులు కైవసం చేసుకోవటానికి అవసరమైన వార్డులు/డివిజన్లు గెల్చుకోవాలని తెరాస వ్యూహంగా అర్థమవుతుంది. ఇంత ప్రయత్నించినా తరువాత కూడా గనుక సరిపోయినన్ని వార్డుల్లో గెలవలేకపోయినా... లేదా ఎక్కడైనా ఒకటి, రెండు ఓట్లు తక్కువ పడినప్పటికీ కూడా ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. వాటితో చాలా సులువుగా నెట్టుకురావచ్చనేది తెరాస వ్యూహం. ఇది వారి కాన్ఫిడెన్స్ కి రహస్యం.