తెలంగాణాలో మునిసిపల్ ఎన్నికల హడావుడి మనకు స్పష్టంగా కనబడుతుంది. అన్ని పార్టీలు తమ తమ ప్రభావాన్ని చాటేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. నామినేషన్ల పర్వం కూడా నిన్నటితో ముగిసింది. అధికార తెరాస అన్ని స్థానాలు మావే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ అది అంత తేలికగా మాత్రం మనకు కనపడడం లేదు. 

కనీసం కొన్ని నియోజికవర్గాల్లోనయినా తెరాస కు బలమైన పోటీ ఎదురయ్యేలానే కనబడుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఇతర పార్టీలకు చెందిన కొందరు ఓడిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద నిరంతర పోరాటం సలుపుతున్నారు. ఇట్లాంటి చోట ఒకింత తెరాస నాయకుడు గనుక బలహీనంగా ఉంటే అది తెరాస కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేకపోలేదు. 

ఇక ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు 7 స్థానాల్లో గెలిచాయి. ఆయా పార్లమెంటు పరిధిలో వారు సత్త చాటడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ముఖ్యంగా బీజేపీ గెలిచిన నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు నియోజిక వర్గాల్లో హిందుత్వ కార్డును ప్రయోగించాయినా సరే లాభపడాలని బీజేపీ భావిస్తుంది. 

ఇక కాంగ్రెస్ కి ఉన్న సాంప్రదాయక వోట్ బ్యాంకును నమ్ముకొని ముందుకు వెళ్లాలని వారు భావిస్తున్నారు. దానికి తోడు ఎంపీ ఎన్నికల్లో గెలిచిన 3 స్థానాలు కాంగ్రెస్ క్యాడర్ లో నూతన బూస్ట్ ఇచ్చినట్టయింది. వారి క్యాడర్ లో జోష్ నింపి ఎన్నికల్లో మరో సారి విజృంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది.   

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో అధికారిక తెరాస కు ఏయే నియోజికవర్గాల్లో ఇటు కాంగ్రెస్ తో, అటు బీజేపీతో పోటీ ఉండబోతుందో చూద్దాం. 


కాంగ్రెస్‌ పోటీ ఇచ్చే స్థానాలు..
 రేవంత్ రెడ్డి ఇటీవల ఎంపీ గా గెలిచిన మల్కాజిగిరి, ఉత్తమ్ ఇటీవల గెల్చిన నల్లగొండ, కోమటి రెడ్డి గెల్చిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గాల ప్రరిధిలోని మునిసిపాలిటీలపై కాంగ్రెస్ తీవ్ర ఆశలు పెట్టుకుంది. 

వీటితోపాటు కేవలం వెంట్రుకవాసిలో ఓడిన చేవెళ్ల, జహీరాబాద్‌ లోక్ సభ పరిధిలోని మునిసిపాలిటీల్లో సైతం ఛాన్స్ ఉందని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక వీటితోపాటు సాంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన మెదక్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, పెద్దపల్లి, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మునిసిపాలిటీల పై కూడా కన్నేసింధీ కాంగ్రెస్. 

ఇక కొందరు సీనియర్ నేతల నియోజకవర్గాల పరిధిలో కూడా కొన్నిటిని కైవసం చేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది కాంగ్రెస్. పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం జగిత్యాల వంటి ప్రాంతాల్లో తెరాస కు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తుంది.

బీజేపీ పోటీ ఇచ్చేది ఈ స్థానాల్లో

ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇటీవల గెల్చిన ఎంపీ సీట్లు ఉండడంతో ఆ పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ సత్త చాటేందుకు ఉబలాటపడుతున్నారు కమలనాథులు. వీటితోపాటు బీజేపీ సాంప్రదాయకంగా బలమైన జంటనగర పరిసర ప్రాంతమైన రంగారెడ్డి జిల్లాలో కూడా తమ సత్త నిరూపించుకోవాలని వారు ఆలోచిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత డీకే అరుణను పార్టీలో చేర్చుకోవడం, ఆమెతోపాటు ఆమె అనుచరులు కూడా భారీగానే చేరడంతో ఆ జిల్లాపై కూడా ఫోకస్ పెట్టింది బీజేపీ.