ఆత్మహత్య చేసుకున్న ఈ ఖమ్మం మిర్చి రైతన్న కుటుంబానికి రైతు బాంధవుడు సీఎం కేసీఆర్, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్ రావు ఏం సమాధానం చెబుతారు? 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రైతులకు వరాల వర్షం కురిపించింది.

లక్ష రూపాయిల రుణ మాఫీ, పంటకు మద్దతు ధర , సాగు నీటి ప్రాజెక్టులకు భారీగా నిధులు, విత్తన కేంద్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉచితంగా ఎరువుల పంపిణీ ఇలా రైతన్నలను ఆకర్షించే పథకాలకు శ్రీకారం చుట్టింది.

సాగు చేసిన పంటను నిల్వ ఉంచుకునేందుకు భారీగా కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసింది.కానీ, ఏమైంది... మూడేళ్లు దాటిన పరిస్థితి మారలేదు. రైతుల ఆత్మహత్యలకు ఫుల్ స్టాఫ్ పడటం లేదు.

మొన్నటి వరకు కందులకు మద్దతు ధర లేక కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిరసన తెలిపితే లాఠీలతో కొట్టించిన గులాబీ నేతలు ఇప్పుడు మిర్చి పంటేసిన రైతులను అదే విధంగా సత్కరిస్తున్నారు.

మిర్చికి మద్దతు ధర లభించడం లేదని మలక్ పేట దిల్ సుఖ్ నగర్ రహదారిపై ఈ రోజు మిర్చి రైతులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. రోడ్డు మీదే మిర్చిని తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.

మరో వైపు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతన్న తాను సాగు చేసిన మిర్చి పంటకు సరైన మద్దతు ధర రాలేదని, పంట నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు లేవని ఆవేదన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో క్యాప్సికం పంట సాగు చేస్తూ కోట్లు సంపాదిస్తుంటే మిర్చి పండిస్తున్న రైతులు మాత్రం కనీసం మద్దతు ధర కూడా లభించకపోవడంతో రోడ్డెక్కుతున్నాడు. ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు.