బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా.. ఒక్కటే కామన్ మొబిలిటీ కార్డు: రాష్ట్ర మంత్రుల భేటీలో నిర్ణయం
బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, క్యాబ్ ఎక్కినా, ఆటో ఎక్కినా, ఎంఎంటీఎస్‌లో ప్రయాణించినా ఒకటే కామన్ మొబిలిటీ కార్డును ఉపయోగించే విధానాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ, శ్రీనివాస్ గౌడ్‌లు సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణలో ప్రజా రవాణాలో ఒక కొత్త విధానం తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించినా.. ట్రైన్, ఎంఎంటీఎస్ ఎక్కినా, క్యాబ్, ఆటో ఎక్కినా ప్రత్యేక టికెట్లు తీసుకోవడానికి బదులు అన్నింటికి కలిపి ఒక్కటే కామన్ మొబిలిటీ కార్డును ప్రవేశపెట్టాలని అనుకుంటున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్, తెలంగాణ ఆర్టీసీ సంస్థలు కార్యచరణను మొదలుపెట్టాయి. తొలిగా ప్రయోగాత్మకంగా హైదరాబాద్ నగరంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు రెండో వారంలో దీన్ని తీసుకురావాలని మంత్రులు నిర్ణయం చేశారు.
కామన్ మొబిలిటీ కార్డుపై రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్‌లు సచివాలయంలో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, మెట్రో రైల్ ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహా ఇతర ఉన్నతాధికారులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సచివాలయంలో జరిగిన భేటీలో మంత్రులకు ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థల ఉన్నతాధికారులు ఈ కార్డుకు సంబంధించిన వివరాలు అందించారు. ఈ కార్డు జారీ ప్రక్రియ మొదలు.. పలు ప్రాంతాల్లో దాని వినియోగం, దాని ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చే సేవల వివరాలను వివరించారు.
Also Read: Manipur Gangrape: మహిళలను నగ్నంగా కొడుతూ పొలాల్లోకి తీసుకెళ్లిన రోజు అక్కడ ఏం జరిగింది?
తొలుత ఈ కార్డును మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి వీలుగా జారీ చేస్తామని, తర్వాత సమీప భవిష్యత్‌లో వీటిని ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలకు కూడా విస్తరిస్తామని మంత్రులు తెలిపారు. అంతేకాదు, భవిష్యత్‌లో వీటి ద్వారా ఇటర కార్డుల తరహాలోనే కొనుగోళ్లు చేసుకోవడానికి ఉపయోగపడేలా రూపొందించాలని, వన్ కార్డ్ ఫర్ ఆల్ నీడ్స్ తరహా ఉండాలని మంత్రులు అధికారులకు ఆదేశించారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా జారీ చేస్తామని, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కార్డు సేవలు అందించే లక్ష్యం పెట్టుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాదు, ఎక్కడ వీలైనా అక్కడ ఈ కార్డును విస్తరిస్తామని చెప్పారు. తద్వార ప్రయాణికులు ఇబ్బందుల్లేకుండా ప్రయాణిస్తారని వివరించారు.
ఈ కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరు సూచించాలని మంత్రులు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ కార్డుకు పేరు సూచించాలని ట్వీట్ చేసి ప్రజలను కోరారు.