ఆ వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించినవి కావు: మంత్రి వేముల
తాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించినవి కావని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు.
హైదరాబాద్: తాను చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రజలను ఉద్దేశించినవి కావని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. బుధవారం నాడు మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాకు ప్రకటనను విడుదల చేశారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్న విషయమై మంగళవారం నాడు మహబూబ్‌నగర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.
also read:పోతిరెడ్డిపాడు, ఆర్డీఎస్ వివాదం: ఆంధ్రోళ్లు ఎప్పటికీ అంతే.... మంత్రి వేముల సంచలన వ్యాఖ్యలు
ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోతారనే తమ బాధగా ఆయన చెప్పారు. ఏపీ నేతలు ఈ విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరిపై ఉద్యమం చేస్తారని సోము వీర్రాజు అంటున్నారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. నీటి వాటాను తేల్చని కేంద్రంపై ఉద్యమం చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణకు నష్టం చేస్తున్న ఆంధ్రపాలకులపైనే తన వ్యాఖ్యలని ఆయన వివరించారు. ఏపీ ప్రజలను ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీఆర్ఎస్ విధానం కూడ అది కాదన్నారు.
కృష్ణా నదిలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లంకలో పుట్టినోళ్లంతా రాక్షసులేనని ఆయన చెప్పారు. పోతిరెడ్డిపాడు నుండి రాయలసీమకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటిని తరలిస్తే ఆనాటి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ మంత్రులు నోరు మెదపలేదన్నారు.