హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. 

ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ ఆఫీసులో నిజామాబాద్ జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, హన్మంత్ షిండే లతోపాటు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మరియు ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆరా తీశారు. 

ఆర్మూర్ నియోజకవర్గంలోని కంఠం, చిక్లీ ,మచ్చర్ల సుర్భిర్యాల్, ఫత్తేపూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలోని చిట్టాపూర్, బాలకొండ, శ్రీరాంపూర్ గ్రామాలకు ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి సాగునీరు అందించేందుకు లిఫ్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

లిఫ్టులు ఏర్పాటు అంశానికి సంబంధించి అధికారులు రూపొందించిన నమూనాపై చర్చించారు. గతంలోనే గుత్ప ఆయకట్టు కింద అలాగే లిఫ్టుల కింద ఉన్నటువంటి ఆయకట్టుకు వంద శాతం నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 

చౌటుప్పల్ హన్మంత్ రెడ్డి లిఫ్టు పథకంలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటిని సరిచేయాలని సూచించారు. హన్మంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దాని కింద ఉన్నటువంటి గ్రామాలకు సాగునీరు అందివ్వాలని అధికారులను ఆదేశించారు.  

నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలలోని ప్యాకేజ్ 21 పైప్ లైన్ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు మరియు గ్రామాభివృద్ధి కమిటీల సహకారంతో రైతులను ఒప్పించి పైప్ లైన్ లు వేయించాలి అని సూచించారు. 

జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి నాగమడుగు లిఫ్ట్ పథకం శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రానున్నట్లు తెలిపారు. కాబట్టి చెక్ డామ్ లొకేషన్, అప్రోచ్ కెనాల్ పొడవు అంశం, పంప్ హౌస్ లొకేసన్ త్వరితగతిన నిర్ణయించాలని అలాగే ప్రాజెక్టులో ఎంత వీలైతే అంత తక్కువగా భూసేకరణ అవసరం అయ్యేటట్లు డిజైన్ చేయాలని సూచించారు.

సంబంధిత వీడియో

కోటీ ఎకరాలకు నీరందించడమే టార్గెట్...: మంత్రి ప్రశాంత్ రెడ్డి (వీడియో)...