హైదరాబాద్: వలస కార్మికులను తరలించేందుకు  ఉచితంగా రైళ్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

గురువారం నాడు ఆయన  ఈ విషయమై స్పందించారు. వలస కార్మికులను తమ స్వంత రాష్ట్రాలకు తరలించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలన్నారు. వలస కార్మికులకు ఆంక్షల నుండి సడలింపు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకొందన్నారు. వలస కార్మికులను స్వంత గ్రామాలకు తరలించేందుకు ఆయా ప్రభుత్వాలే బస్సులను ఏర్పాటు చేయాలని కేంద్రం చెప్పడం సరైంది కాదన్నారు.

also read:కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల ధరఖాస్తుల గడువు పెంపు...

తెలంగాణ రాష్ట్రంలో బీహార్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని ఆయన  గుర్తు చేశారు. వలస కూలీలను తరలించేందుకు కేంద్రం రైళ్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. బస్సుల్లో నాలుగైదు రోజుల పాటు ప్రయాణం చేయడం ఇబ్బందికరమన్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ఆయా రాష్ట్రాల్లో చిక్కుకొన్న వలస కూలీలు, విద్యార్థులు, టూరిస్టులను తమ స్వంత గ్రామాలకు తరలించేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.