బీసీ మంత్రులపై కోవర్ట్ ఆపరేషన్: రేవంత్ రెడ్డిపై శ్రీనివాస్ గౌడ్ సంచలనం
తెలంగాణలోని ముగ్గురు బీసీ మంత్రులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణలోని ముగ్గురు బీసీ మంత్రులపై కోవర్ట్ ఆపరేషన్ చేపట్టారని స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. దీని వెనుక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు.శుక్రవారంనాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. బీసీ మంత్రులను చూసి రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారన్నారు.ముగ్గురు బీసీ మంత్రులపై రేవంత్ రెడ్డి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీసీలను కించపరిస్తే సహించేది లేదన్నారు శ్రీనివాస్ గౌడ్.తమను కించపరిచే విధంగా మాట్లాడితే రాజకీయంగా అణగదొక్కుతామని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
కొడంగల్ లోనే రేవంత్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని ఆయన ఎద్దేవా చేశారు. గతంలోనే ఆయన కొడంగల్ లో ఓటమి పాలైనట్టుగా శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. తాను గెలుస్తాడో లేదో చూసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలూడదీసి కొడతానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శ్రీనివాస్ గౌడ్ తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటిస్తున్నారు. మరో వైపు ఆయా నియోజకవర్గాల్లో వలసలను కూడ ప్రోత్సహిస్తున్నారు. అధికార పార్టీలోని అసంతృ.ప్తులను తమ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు ఈ మాసంలోనే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.
గద్వాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత కూడ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కకుండా చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం కూడ కేంద్రీకరించి పనిచేస్తుంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. గత వారంలో మహబూబ్ నగర్ లో జరిగిన ఓ సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కౌంటరిచ్చారు.