హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికను టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు మింగుడు పడడం లేదని అర్థమవుతోంది. దేత్తడి హారిక విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిక నియామకం గురించి సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఏ విధమైన సమాచారం లేదని ఆయన చెప్పారు. 

అసలు హారిక ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, త్వరలోనే దానిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. దాని వెనకు ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే ఓ మంచి సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తామని ఆయన చెప్పారు. 

Also Read: అంబాసిడర్‌గా దేత్తడి హారికే కొనసాగుతారు, అందరికీ చెప్పా: ఉప్పల శ్రీనివాస్ క్లారిటీ

దేత్తడి హారికకు ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామకం ఉత్తర్వులు అందజేసిన విషయం తెలిసిందే. దానిపై సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ సమాచారం లేదని వార్తలు వచ్చాయి. ఆమె వివరాలను వైబ్ సైట్ నుంచి తొలగించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దాదాపుగా ఆమె నియామకాన్ని రద్దు చేసినట్లు ప్రచారం జరిగింది.

అయితే, టూరిజం బ్రాండ్ అంబాసిడగర్ గా హారిక కొనసాగుతారని ఆ తర్వాత శ్రీనివాస్ గుప్తా స్పష్టం చేశారు. ఈ ఘటనతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు, ఉప్పల శ్రీనివాస్ కు మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. తాజాగా శ్రీనివాస్ గౌడ్ ప్రకటనను బట్టి కూడా ఆ వివాదం సమసిపోలేదని అర్థమవుతోంది.