హైదరాబాద్: పీఆర్‌సీ నివేదికను చూసిన ఆందోళన చెందొద్దని తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సంప్రదింపులు జరిపిన తర్వాతే ఉద్యోగులు సంతృఫ్తి పడేలా సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకటిస్తారని ఆయన తెలిపారు.

తెలంగాణలో గ్రూప్-1 అధికారుల సంఘం డైరీని బుధవారం నాడు రవీంద్రభారతిలో  మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా పీఆర్సీ నివేదిక ఆలస్యమైందన్నారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించిన మీదటే కేసీఆర్ నిర్ణయం తీసుకొంటారని ఆయన హామీ ఇచ్చారు.  

ఉద్యోగులు ప్రభుత్వాన్ని అర్ధం చేసుకోవాల్సిందిగా కోరారు. నివేదికతో సంబంధం లేకుండానే వేతనాల పెంపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సర్వీస్ రూల్స్ ఆధారంగా అర్హులకు పదోన్నతులు కల్పించాలని సీఎం ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

7.5 శాతం ఫిట్‌మెంట్  ఇవ్వాలని పీఆర్సీ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.అయితే ఈ నివేదికను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ నివేదిక లీక్ కావడంపై  ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయమై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.