ఖమ్మం: ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై ఎలాంటి కరోనా వ్యాక్సిన్లు పనిచేయవని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం జిల్లా పర్యటన సమయంలో టీఆర్ఎస్ పై చేసిన విమర్శలకు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటరిచ్చారు.ఆదివారం నాడు ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సమయంలో కొందరు టూరిస్టులు వస్తుంటారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఓ బత్తాయి వచ్చింది. ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తొండి సంజయ్ అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కార్పోరేషన్ ఎన్నికల్లో నాలుగు ఓట్ల కోసం ఆయన ఖమ్మంలో పర్యటించారని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పై కరోనా వ్యాక్సిన్ ను ప్రయోగించామని సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన కౌంటరిచ్చారు.

ఖమ్మంలో ఎలాంటి వ్యాక్సిన్లు పనిచేయవన్నారు. వ్యాక్సిన్ వేసినా కూడ తిప్పికొట్టేందుకు ఇక్కడ ప్రజలకు బాగా రోగ నిరోధక శక్తి ఉందని ఆయన చెప్పారు. కూకట్‌పల్లి డివిజన్ లో ఏడు కార్పోరేటర్లలో ఆరు గెలుచుకొని బండి సంజయ్ కు తాను వ్యాక్సిన్ వేశానని ఆయన చురకలంటించారు.

లక్షలాది మంది ప్రజలకు మమత ఆసుపత్రి ద్వారా సేవలందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిపై బండి సంజయ్ ఆరోపణలు చేయడం సరైందికాదన్నారు. సంజయ్ కార్పోరేటర్ కాకముందే మమత ఆసుపత్రి ఏర్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని  ఆయన హితవు పలికారు.

తనపై బండి సంజయ్  చేసిన ఆరోపణలను నిరూపించేందుకు 2023 ఎన్నికల వరకు కాదు... దమ్ముంటే ఇప్పుడే నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.ఖమ్మంలో తమకు కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్ధి అని పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.