Asianet News TeluguAsianet News Telugu

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాడ్లు, కర్రలతో వెళ్తారా?: బండి సంజయ్‌కి మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్న


వరి ధాన్యం కొనుగోలు విషయమై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.  ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

Telangana minister Niranjan Reddy serious comments on Bjp
Author
Hyderabad, First Published Nov 16, 2021, 3:29 PM IST


హైదరాబాద్: ఏడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాలు చేస్తున్న రైతులను గురించి పట్టించకోని బీజేపీ నేతలు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు.మంగళవారం నాడు హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  వరి ధాన్యం కొనుగోలు విషయంలో పేరుతో బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు వరి కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి వరిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.  

ఏడాదిగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తోంటే Bjp ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మూర్ఖపు చర్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు.  బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని ఆయన విమర్శించారు. కార్పోరేట్ శక్తులకు బీజేపీ ఊతమిచ్చే చర్యలు తీసుకొంటుందన్నారు.  ప్రజల ఆస్తులను కేంద్రంలోని బీజేపీ సర్కార్  ప్రైవేట్ పరం చేస్తోందని చెప్పారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు ఆటోలో రాడ్లు, కర్రలు తీసుకుపోతారా అని ఆయన బీజేపీ నేతలను ప్రశ్నించారు.  పక్క రాష్ట్రంతో నీటి వివాదాలు కొనసాగుతున్న సమయంలో ఆ వివాదాలను పరిష్కరించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతుల ఆత్మ విశ్వాసం  దెబ్బతినేలా  వ్యవహరిస్తుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్ అని ఆయన విమర్శించారు.ప్రధాన మంత్రి narendra modi ఏనాడైనా రైతుల గురించి మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ తెలంగాణ చీఫ్ Bandi Sanjay పరిశీలిస్తున్నారు. అయితే బండి సంజయ్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొంటున్నారు.  బీజేపీ, trs శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయమై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసే వరకు  కేంద్రాన్ని వెంటాడుతామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ప్రస్తుత వర్షాకాల సీజన్ లో వరి ధాన్యం కొనుగోలును పూర్తి చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.  కేంద్రం తీరును ఎండగట్టేందుకు టీఆర్ఎస్  అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సీజన్ లో  ధాన్యం కొనుగోలు విషయమై లోటుపాట్లను ఎత్తిచూపేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటిస్తున్నారు.

also read:కారణమిదీ:బండి సంజయ్ పై నల్గొండలో కేసు

వరి అంశాన్ని అస్త్రంగా చేసుకొని బీజేపీపై పై చేయి సాధించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు బీజేపీ నాయకత్వం అదే స్థాయిలో ప్రయత్నిస్తోంది.  ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలు అమలు కావడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల కళ్లాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పిన సీఎం హామీ అమలు కావడం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.  కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios