Asianet News TeluguAsianet News Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలి: కేంద్రానికి కేటీఆర్ లేఖ

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను  నిలిపివేయాలని  తెలంగాణ మంత్రి కేటీఆర్  కేంద్రాన్ని కోరారు.  ఈ మేరకు  ఇవాళ  కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి  లేఖ  రాశారు. 

Telangana Minister  KTR  Writes Letter  To   Union Government  Over  Visakha Steel Plant  lns
Author
First Published Apr 2, 2023, 12:07 PM IST


హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిలిపివేయాలని  తెలంగాణ మంత్రి కేటీఆర్  ఆదివారం నాడు  కేంద్ర ప్రభుత్వానికి  లేఖ రాశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్   ను ప్రైవేట్ సంస్థలకు  అప్పగించే  కుట్ర జరుగుతుందని   ఆ లేఖలో  మంత్రి కేటీఆర్  ఆరోపించారు.  కార్పోరేట్  శక్తులకు  రూ. 12. 5 లక్షల  కోట్ల  రుణాలు మాఫీ చేశారని మంత్రి కేటీఆర్ గుర్తు  చేశారు. కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్  పట్ల  ఎందుకు  ఔదార్యం చూపడం లేదని  మంత్రి ప్రశ్నించారు.

 విశాఖ స్టీల్ ప్లాంట్  వర్కింగ్  కేపిటల్  కోసం  ఆర్ధిక సహాయం చేయాలని ఆయన కోరారు. విశాఖ  స్టీల్ ప్లాంట్  ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనాలని ఆయన ఆ లేఖలో డిమాండ్  చేశారు.  సెయిల్ తో విశాఖ విలీనాన్ని  పరిశీలించాలని  కేటీఆర్  సూచించారు..విశాఖ  ఉక్కుకు కేంద్రం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని ఆయన ఆ లేఖలో డిమాండ్  చేశారు. వర్కింగ్ కేపిటల్, ముడి సరకు కోసం నిధులను  సమీకరణ పేరుతో కొత్త కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. 

గతంలో పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్ పేయ్  ప్రధానులుగా ఉన్నప్పుడు ఇచ్చిన నిధులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు  చేశారు.  
వైజాగ్ ఉక్కు తెలుగు వారి హక్కన్నారు. దీని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యతగా   ఆయన  పేర్కొన్నారు.  భారత రాష్ట్ర సమితి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు సంఘీభావం తెలపాలని ఆంధ్రప్రదేశ్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు  తోటా చంద్రశేఖర్ కు సూచించారు కేటీఆర్.కేంద్ర ప్రభుత్వం తన ఎజెండా అమలు కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ ను క్రమంగా చంపే ప్రయత్నం  ఎప్పటినుంచో చేస్తుందని ఆయన  విమర్శించారు.  

మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పేరిట గతిశక్తి వంటి కార్యక్రమాలతో ముడిపెట్టి కేంద్రం గొప్పలు చెప్పుకుంటోందన్నారు.  కానీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని  ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని ఆయన  విమర్శించారు.   స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందని  మంత్రి కేటీఆర్  అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని తెలిపారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 7.3 ఎంటిపిఏ కెపాసిటీ ఉన్నా కేవలం ముడి సరుకును, మూలధనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పూర్తిస్థాయి కెపాసిటీతో పనిచేయలేకపోతోందని తెలిపారు. ప్రస్తుతం పని చేస్తున్న 50 శాతం కెపాసిటికి కూడా 100 శాతం కెపాసిటి ఉత్పత్తికి అయ్యే ఖర్చే అవుతుందని మంత్రి చెప్పారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తే 100% కెపాసిటీతో పని చేయడం వల్ల అనేక ఖర్చులు కలిసి వచ్చి  స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మివేయడమే ఏకైక  ఎజెండాగా పనిచేస్తుందని కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి జాతికి తీరని నష్టాన్ని కలిగించిందన్నారు.

 ఒకప్పుడు దేశ అభివృద్ధిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం నష్టాలను సాకుగా చూపించి ప్రైవేట్ పరం చేస్తున్నారని  ఆయన  ఆరోపించారు.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగాల భవిష్యత్తును కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వారితో కలిసి పని చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి  ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. 

ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, లక్షలాదిమంది కార్మికుల శ్రేయస్సు కోసం వారితో కలిసి నడిచేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ దిశగా తమతో కలిసి రావాలని ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  విషయంలో  పున: పరిశీలన లేదని  కూడా  కేంద్రప్రభుత్వం  ఇటీవలనే  స్పష్టం  చేసింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా  ఎంపీలు అడిగిన ప్రశ్నకు  ఇటీవలనే కేంద్రం  రాతపూర్వకంగా  సమాధానం ఇచ్చింది.  విశాఖ స్టీల్ ప్లాంట్  నష్టాలబాటలో  పయనిస్తున్నందున  ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.  అయితే  విశాఖ స్టీల్ ప్లాంట్   లాభాల బాటలోకి వెళ్లేందుకు   తీసుకోవాల్సిన  పలు సూచనులు, సలహాలను  జేఏసీ నేతలు  సూచిస్తున్నారు. ఈ విషయమై  కేంద్ర ప్రభుత్వానికి  గతంలోనే  ఏపీ సీఎం వైఎస్ జగన్  లేఖ కూడా రాశారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కోరుతూ  స్టీల్ ప్లాంట్  కార్మికులు , ఉద్యోగులు  జేఏసీగా ఏర్పడి  ఆందోళనలు  నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను  వైసీపీ, బీజేపీ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios