Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్: కేటీఆర్

బీజేపీ నేతలు చేసే విమర్శలపై వంద మంది తిప్పికొట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ  చేసే ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం స్థాయిలో చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇవాళ కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు.

Telangana Minister KTR Satirical Comments on BJP Telangana President Bandi Sanjay
Author
Hyderabad, First Published Nov 9, 2021, 3:46 PM IST

హైదరాబాద్: తెలంగాణ సర్కార్ చేసిన అభివృద్దికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.మంగళవారం నాడు ఆయన కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ పథకాలు చూపిస్తూ  బీజేపీ అధ్యక్షుడు  ఫోటోలకు ఫోజులిచ్చాడన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో రైతుల కోసం పోరాటం చేద్దామని ఆయన ప్రజలను కోరారు. అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలోనూ తిప్పికొట్టాల్సిందిగా కోరారు.

సీఎం అయ్యాక kcr సాఫ్ట్ అయ్యారని అంతా అనుకుంటున్నారని... రెండు రోజులుగా Bjp పై సీఎం చేసిన విమర్శలను చూస్తే పాత కేసీఆర్ ను చూసినట్టుగా అనిపిస్తోందని Ktr చెప్పారు. ఇదే విషయమై తనకు మిత్రుల నుండి సందేశాలు వస్తున్నాయని ఆయన వివరించారు. 20 ఏళ్లు కాదు మరో 80 ఏళ్లు రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి ఉంటుందని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. 

also read:94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, భయపడం:కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంటర్

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి వచ్చి పథకాల అమలు తీరును పరిశీలించారని మంత్రి తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ నుండి వరి ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా చెప్పాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

వరి ధాన్యం కొనుగోలు విషయమై  కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి Kishan Reddyస్పందించారు.2014లో తెలంగాణలో 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందన్నారు.ఇప్పుడు 151 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. వరి పండించే రైతులకు కేంద్రం కనీస మద్దతు ధర అందిస్తోందన్నారు.పంజాబ్ తర్వాత అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుండే కేంద్రం బియ్యాన్ని సేకరిస్తోందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.   ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని  కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఎంత ధాన్యం దిగుబడి వస్తోందోననే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్పష్టత లేదని మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మూడు రకాలుగా కేంద్రానికి రాష్ట్రం నుండి సమాచారం పంపిన విషయాన్ని కిషన్ రెడ్డి చెప్పారు.  బాయిల్డ్ రైస్ మినహా రా రైస్ ను దశలవారీగా కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు.

వరి ధాన్యాన్ని కొనుగోలు విషయమై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ గత మాసంలో దీక్షకు దిగాడు.మరో వైపు వరి పంట వేయాలని రైతులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాసంగిలో వరి ధాన్యం వేయవద్దని కోరింది. అయితే మిల్లర్లతో, సీడ్ కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు వరి పంట వేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios