దంచి కొడుతున్న వానలు : కేటీఆర్ అప్రమత్తం, భారీ వర్షం వచ్చినా ఎదుర్కోవాలి .. అధికారులకు ఆదేశాలు
గడిచిన రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ , పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు కురిసినా పరిస్ధితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని ఆదేశించారు.

గడిచిన రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఐటీ , పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమీషనర్, జోనల్ కమీషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురిసినా పరిస్ధితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని ఆదేశించారు.
వచ్చే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని.. భారీ వర్షం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కేటీఆర్ సూచించారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని.. ప్రాణనష్టానికి అవకాశం ఇవ్వొదని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లో వరదలు, పారిశుద్ధ్యంపైనా మంత్రి కేటీఆర్ కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ALso Read: గోదావరి నదికి పెరుగుతున్న వరద.. భద్రాచలం వద్ద 25.6 అడుగులకు చేరిన నీటిమట్టం..
దీనిపై అధికారులు స్పందిస్తూ.. జీహెచ్ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాలను సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జలమయం అయ్యే ప్రధాన రహదారుల వంటి చోట్ల డి వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి ప్రాథమిక కార్యక్రమాలను పూర్తి చేసినట్లు అధికారులు కేటీఆర్‌కు వివరించారు . జీహెచ్ఎంసీ చేపట్టిన ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమంలో భాగంగా నాలాల బలోపేతం చేయడం వలన వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఇబ్బందులు తప్పుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగర పారిశుద్ధ్య నిర్వహణ గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుందని కేటీఆర్ అన్నారు. దీనితోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కేటీఆర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నగరం వేగంగా విస్తరించడం, జనాభా పెరగడం వంటి అంశాల వలన నగరంలో చెత్త ఉత్పత్తి పెరుగుతోందని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు పారిశుధ్య నిర్వహణ ప్రణాళికలను సైతం ఎప్పటికప్పుడు నిర్దేశించుకుంటూ ముందుకు పోవాలని మంత్రి సూచించారు.