సీట్లు అమ్ముకున్నట్టే రాష్ట్రాన్ని అమ్ముకుంటారు: సూర్యాపేటలో కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ ఇవాళ పాల్గొన్నారు.
సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అవకాశమిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.సోమవారంనాడు సూర్యాపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.
బీఆర్ఎస్‌ది వారసత్వ రాజకీయమని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విమర్శలకు మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. తమది కుటుంబ పాలనే.. రైతులే తమ కుటుంబమని కేటీఆర్ చెప్పారు.రాణి రుద్రమదేవి, భాగ్యరెడ్డివర్మ, కొమరంభీం వారసత్వం తమదని కేటీఆర్ గుర్తు చేశారు. తమది గాంధీ వారసత్వమైతే బీజేపీది గాడ్సే వారసత్వంగా కేటీఆర్ పేర్కొన్నారు.
దళితబంధుతో దళితులకు కేసీఆర్ అండగా నిలిచారని మంత్రి చెప్పారు. తెలంగాణ ప్రజలు వసుదైక కుటుంబంగా కేటీఆర్ పేర్కొన్నారు.ఈ కుటుంబానికి కేసీఆర్ పెద్ద దిక్కు అని మంత్రి తెలిపారు.వారంటీ లేని 150 ఏళ్ల పార్టీ గ్యారంటీ లేని హామీలిస్తుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వారంటీ అయిపోయి వందేళ్లు అయిందని ఆయన ఎద్దేవా చేశారు.
విద్యుత్ వైర్లు పట్టుకొంటే 24 గంటలు విద్యుత్ వస్తుందో లేదో తెలుస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ కావాలంటే ఏఈ, డీఈకి ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఉచితంగా 24 గంటల పాటు విద్యుత్ ను సరఫరా చేస్తున్నామన్నారు. మూడు గంటల కంటే ఎక్కువ విద్యుత్ ను కాంగ్రెస్ సర్కార్ ఇవ్వదని కేటీఆర్ చెప్పారు.తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రూ. 200 పెన్షన్ కూడ ఇవ్వలేదన్నారు. కానీ తమకు అధికారం అప్పగిస్తే రూ. 2వేల పెన్షన్ ఇస్తామని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు.60 ఏళ్లు కాంగ్రెస్ కు అధికారమిస్తే ఏం చేశారని ఆయన అడిగారు. కాంగ్రెస్ ను నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపలా పెట్టినట్టేనన్నారు.కాంగ్రెస్ పార్టీని ముసలినక్కగా కేటీఆర్ అభివర్ణించారు.
కేసీఆర్ హయంలో కరెంట్, తాగు, సాగు నీరు అవరోధాలు లేకుండా అందిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ హయంలో కడుపు నిండా సంక్షేమం,కంటి నిండా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.కాంగ్రెస్, బీజేపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.