ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం?: చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్
టీడీపీ చీఫ్ చంద్రబాబు అరెస్టులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: ఏపీ రాజకీయాలతో తెలంగాణకు సంబంధం ఏమిటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శన గురించి మంత్రి కేటీఆర్ స్పందించారు. మంగళవారంనాడు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఇక్కడ ర్యాలీలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇక్కడ ఒక్క పార్టీ ర్యాలీ నిర్వహిస్తే మరో పార్టీకి మరో రోజున పోటీ ర్యాలీ నిర్వహిస్తామంటే ఏం చేయాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ మధ్య పంచాయితీని హైద్రాబాద్ వేదికగా ఎందుకు చేసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ అడిగారు. ఈ రెండు పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. తెలంగాణలో స్థానం లేని పార్టీలు హైద్రాబాద్ లో ఈ విషయమై ర్యాలీలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీలోని అమరావతి, రాజమండ్రి, అమరావతిలో తేల్చుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
హైద్రాబాద్ లో ర్యాలీలకు ఎందుకు అనుమతివ్వలేదని ఓ మిత్రుడి ద్వారా లోకేష్ తనను అడిగారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే శాంతిభద్రతలకు ఇబ్బంది కల్గకూడదనేది తమ అభిమతమని కేటీఆర్ చెప్పారు. జగన్, పవన్ కళ్యాణ్, లోకేష్ తనకు స్నేహితులేనని కేటీఆర్ వివరించారు. తెలంగాణలో ఐటీ రంగం దెబ్బతినకూడదనేది తమ అభిమతన్నారు. గత ప్రభుత్వాలు కూడ ఐటీ రంగంలో ఎలాంటి ఆందోళనలకు అనుమతులు ఇవ్వని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అరెస్టుపై చంద్రబాబునాయుడు న్యాయ పోరాటం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.ఈ సమయంలో తెలంగాణలో ర్యాలీలు చేస్తే ఊరుకోబోమన్నారు. సెన్సిటివ్ అంశాన్ని సెన్సిటివ్ గా డీల్ చేయాలన్నారు.
also read:మీకు రాజకీయాలతో సంబంధం లేదా?: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై తమిళిసై పై కేటీఆర్ ఫైర్
తనకు ఆంధ్రతో తగాదాలు లేవన్నారు. ఆంధ్రతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ, కేరళ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలకు చెందినవారంతా హైద్రాబాద్ లో సంతోషంగా ఉన్నారన్నారు. ఏపీకి చెందిన ప్రజలు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తాము స్పందించోమన్నారు.ఈ విషయమై తమ పార్టీకి చెందిన నేతలు ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతమన్నారు.