మీకు రాజకీయాలతో సంబంధం లేదా?: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై తమిళిసై పై కేటీఆర్ ఫైర్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు కేసీఆర్ కేబినెట్ సిఫారసు చేసిన ఇద్దరి పేర్లను గవర్నర్ తిరస్కరించడంపై కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ఎజెండా మేరకు గవర్నర్ పనిచేస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎవరిని నామినేట్ చేయాలన్నది తమ హక్కని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారిని ఎమ్మెల్సీలు, రాజ్యసభకు పంపిన ఉదంతాలను మంత్రి కేటీఆర్ వివరించారు.
దాసోజు శ్రవణ్ కుమార్ , కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫారసులను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించారు. మంగళవారంనాడు హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దాసోజు శ్రవణ్ కుమార్, ప్రొఫెసర్,కుర్రా సత్యనారాయణ ట్రేడ్ యూనియన్ లో కీలకంగా పనిచేశారని కేటీఆర్ గుర్తు చేశారు. వీరిద్దరూ కూడ బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారన్నారు. వీరిద్దరికి ఎమ్మెల్సీ పదవుల కోసం కేబినెట్ సిఫారసు చేసి పంపితే గవర్నర్ తిప్పి పంపడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఉద్యమంలో ఉన్నవారికి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలనే నిర్ణయంలో భాగంగా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గవర్నర్ మేడమ్ కు మా మీద కోపం ఉన్నా... శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలపై ఉండదనుకున్నామన్నారు. వీరిద్దరికి రాజకీయాలతో సంబంధం ఉందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.
గవర్నర్ గా బాధ్యతలు చేపట్టక ముందు రోజు వరకు తమిళిసై సౌందర రాజన్ బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. సర్కారియా కమిషన్ సిఫారసులను తుంగలో తొక్కి తమిళిసై సౌందరరాజన్ ను గవర్నర్ గా నియమించారని కేటీఆర్ విమర్శించారు.గవర్నర్ సరిగ్గా ఆలోచించి ఉంటే ఈ నిర్ణయం తీసుకొని ఉండరన్నారు.సర్కారియా కమిషన్ ను తుంగలో తొక్కింది ఎవరని ఆయన ప్రశ్నించారు. మీకు రాజకీయాలతో సంబంధం లేదా అని గవర్నర్ ను కేటీఆర్ ప్రశ్నించారు.
also read:నేనేమీ వ్యాఖ్యానించను:గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై తమిళిసై సౌందర రాజన్
పలు రాష్ట్రాల్లో రాజకీయాలతో సంబంధం ఉన్నవారిని ఎమ్మెల్సీలుగా, రాజ్యసభకు పంపిన విషయాన్ని కేటీఆర్ మీడియా సమావేశంలో వివరించారు. దేశానికి గవర్నర్ లాంటి పోస్టులు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.గవర్నర్ పోస్టులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతుందని మంత్రి ఆరోపించారు.బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థ అవసరం లేదన్నారు. మోడీ ఎజెండాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణలో అమలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.