తెలంగాణపై ఎందుకీ వివక్ష.. పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి : కేంద్రానికి కేటీఆర్ లేఖ
తెలంగాణలోని నగరాలు, పట్టణాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి కేటీఆర్ ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణపై వివక్షతోనే కేంద్రం నిధులు కేటాయించడం లేదని కేటీఆర్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు.తెలంగాణలోని నగరాలు, పట్టణాలకు నిధులు విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం .. కేంద్రం నుంచి నిరాశే ఎదురవ్వడం షరా మామూగా మారిందన్నారు. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకు ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. కేంద్రం మొండిచేయి చూపినా అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి కనబరుస్తోందని.. ఇందుకు కేంద్రం ఇచ్చిన అవార్డులు, రివార్డులే నిదర్శనమని కేటీఆర్ గుర్తుచేశారు. తమ ప్రయత్నానికి ప్రోత్సహకంగా నిధులు కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై వివక్షతోనే కేంద్రం నిధులు కేటాయించడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామన్నారు. కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని కేటీఆర్ దుయ్యబట్టారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నీకు పదవికి రాజీనామా చేసే దమ్ము ఎలాగూ లేదు.. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయలేని అసమర్ధుడివంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం తెలంగాణ ప్రజలకైనా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు ఎక్కువ అని కేటీఆర్ ఆరోపించారు.
రెండు జాతీయ పార్టీలు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పెట్టుబడి ద్వారా సంపద సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని మంత్రి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా.. జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ మారలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.