సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయంపై కేంద్రంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ . ఈ వ్యవహారంపై 9 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని, ఇప్పటికీ ఒప్పుకోలేదని ఆయన దుయ్యబట్టారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయంపై కేంద్రంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ . ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 40 పైసలే తిరిగి వస్తున్నాయన్నారు. ఎదుగుతున్న రాష్ట్రానికి మరింత సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని మంత్రి చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కేంద్రమే చెబుతోందని.. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ భూముల గురించి కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. రక్షణ శాఖ భూములున్నచోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని.. సికింద్రాబాద్‌లో అభివృద్ధి పనులకు సహకరించాలని కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు. రక్షణశాఖ ఇచ్చే స్థలాలకు సమానమైన భూమిని మరోచోట ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.
ALso Read: హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాలు.. రాజకీయ పార్టీల ఐక్యత కంటే అదే ముఖ్యం: కేటీఆర్
కేంద్రం సంబంధిత భూములిస్తే ప్రజోపయోగ పనులకు వాడతామని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యవహారంపై 9 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని, ఇప్పటికీ ఒప్పుకోలేదని ఆయన దుయ్యబట్టారు. రాజీవ్ రహదారిపై స్కైవేల నిర్మాణానికి భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని కేటీఆర్ తెలిపారు. మెట్రో రైలు విస్తరణకు కూడా కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 31 కి.మీ. మేర మెట్రోను విస్తరించాలని భావిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
లక్నో , అహ్మదాబాద్‌లో కంటోన్మెంట్ భూములు మెట్రో కోసం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 మెట్రో ప్రాజెక్టులకు సహకరించారని.. అహ్మదాబాద్‌కు భారీగా నిధులిచ్చి హైదరాబాద్‌కు ఇవ్వలేదని మంత్రి చురకలంటించారు. ఎంఎంటీఎస్ విస్తరణకు రాష్ట్ర తరపు వాటా నిధులు కేటాయించామని.. ప్రజారవాణా కోసమే జరుగుతున్న పనులకు కేంద్రం సహకరించాలని కేటీఆర్ కోరారు. లేనిపక్షంలో కేంద్రం వైఖరిని ప్రజల్లో ఎండగడతామని.. రాష్ట్రానికి అప్పుగా ఇచ్చిన వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని మంత్రి విమర్శించారు.
