బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కేంద్రంగా నేషనల్ మీడియా ఉండొచ్చని.. అయితే ఢిల్లీ కేంద్రంగా మాత్రమే దేశం నడవదని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేటీఆర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ఈరోజు సమావేశం అయింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ సమస్యలను కాంగ్రెస్, భాజపా పరిష్కరించలేకపోయాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా సమస్యలు అలాగే ఉన్నాయని అన్నారు. నేటికి దేశంలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయని చెప్పారు.
దేశంలో ఇప్పటివరకు ఉన్న పనిచేసిన ప్రధానమంత్రులలో అత్యంత బలహీనమైన ప్రధాని మోదీ అని విమర్శించారు. రూపాయి విలువ పాతాళంలోకి వెళ్లిందని.. అప్పులు ఆకాశానికి చేరాయని విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తున్న సమయంలో.. తమను ఎవరికో బీ టీమ్ అంటే ఎలా అని ప్రశ్నించారు. ఎవరు ఎవరికి బి టీమ్, ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ప్రజలకు తెలుసునని అన్నారు.
Also Read: రాజ్‌నాథ్ సింగ్‌కు నాలుగు రిక్వెస్ట్‌లు ఇచ్చాం.. ఇప్పటికైనా సాయం చేస్తే సంతోషిస్తాం: కేటీఆర్
ఢిల్లీ కేంద్రంగా నేషనల్ మీడియా ఉండొచ్చని.. అయితే ఢిల్లీ కేంద్రంగా మాత్రమే దేశం నడవదని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా కూడా జాతీయ రాజకీయాలు చేయొచ్చని.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి బీఆర్ఎస్‌లో ఎన్ని చేరికలు అవుతున్నాయో చూసుకోండని అన్నారు. నేషనల్ మీడియాకు నేషనల్ క్యాపిటల్ గొప్ప కావొచ్చని.. తమకు హైదరాబాద్ స్థావరమని, తాము అక్కడి నుంచే జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పుతామని చెప్పారు. భవిష్యతులో మీరే చూస్తారని అన్నారు.
సమాఖ్య స్పూర్తికి విరుద్దంగా కేంద్రం చర్యలు ఉంటే తప్పకుండా వ్యతిరేకించి తీరుతామని చెప్పారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కేసీఆర్ ఇప్పటికే వ్యతిరేకించారని.. దీనిపై పార్లమెంట్‌లో బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఆర్డినెన్స్ విషయంలో బీజేపీకి మద్దతుగా కాంగ్రెస్ ఓటేస్తానని అంటుందని.. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటేనని విమర్శించారు. దేశంలో వాళ్లే ఉండాలనేది రెండు పార్టీల సిద్దాంతమని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమైన ఈ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించడం లేదని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని అన్నారు.
ఇక, ఏఎన్‌ఐ వార్తా సంస్థతో కేటీఆర్ మాట్లాడుతూ.. నేడు దేశంలోనెలకొన్న సమస్యలపై ప్రజలను ఏకం చేయడం కంటే.. రాజకీయ పార్టీల ఐక్యత అంత ముఖ్యమైనది కాదని అన్నారు. నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్, బీజేపీలే కారణమని విమర్శించారు. బీజేపీ లేదా కాంగ్రెస్‌ను తమతో పాటు కలుపుకుని రాజకీయ పార్టీలు ఒక్కటైతే దేశానికి ప్రయోజనం ఉండదని అన్నారు.
