సారాంశం

ప్రధాని మోడీ పాలమూరులో చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టులతో చుక్క నీరు రాలేదనడం ప్రధాని అవివేకానికి నిదర్శనం అని, బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉన్నదని కామెంట్ చేశారు. ప్రజలు తెలంగాణలో కాదు.. కేంద్రంలో మార్పు కోరుతున్నారని తెలిపారు.
 

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణలో పర్యటించి పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ హామీలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు కూడా చేశారు. అవినీతి ఆరోపణలు, కుటుంబ పార్టీలనీ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

కారు స్టీరింగ్ వేరే వారి చేతిలో ఉన్నదని ప్రధాని చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో పదిలంగా ఉన్నదని కేటీఆర్ అన్నారు. కానీ, బీజేపీ స్టీరింగే అదానీ చేతిలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. కిసాన్ సమ్మన్ కింద కేంద్రం ఇచ్చింది నామమాత్రమేనని, తెలంగాణ రాష్ట్రం కొత్తదైనప్పటికీ 70 లక్షల మంది రైతులకు రూ. 72 వేల కోటలను నేరుగా ఖాతాల్లో జమ చేసిందని, ఈ విషయం ప్రధాని తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఇక రైతులకు రుణమాఫీనే జరగలేదని అనడం మిలియన్ డాలర్ జోక్ అని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

Also Read: ఈ సారి కురుక్షేత్రమే .. మీరు కౌరవులు, మేం పాండవులం .. నా పై కేసులు పెడతావా పెట్టుకో : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్

అన్నదాత అప్పులు మాఫీ చేసిన కిసాన్ ప్రభుత్వం తమదైతే రైతుల రక్తం కళ్లచూసిన హంతకరాజ్యం మీదని కేటీఆర్ అన్నారు. ఇక ప్రాజెక్టుల వల్ల చుక్క నీరు రాలేదని అనడం ప్రధాని అవివేకానికి నిదర్శనం అని మండిపడ్డారు. తెలంగాణలో సాగునీటి విప్లవం సాగుతున్నదని వివరించారు. కాళేశ్వరం, పాములూరు ప్రాజెక్టులైనా ప్రపంచ సాగునీటి చరిత్రలోనే అతిగొప్ప మానవ నిర్మిత అద్భుతాలని వివరించారు. ఎన్నికల హామీలు గాలికొదిలి ఓట్ల వేటలో ఇప్పుడు మాట్లాడితే ఇక్కడ ఎవరు నమ్ముతారు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో మార్పు కాదు.. దేశ ప్రజలంతా కేంద్రంలో మార్పు కోరుతున్నారని,  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కోరుకుంటున్నారని కామెంట్ చేశారు.