Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రముఖ హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ ఈవెంట్ బయో ఏషియా-2023 20వ ఎడిషన్ శుక్రవారం ప్రారంభ‌మైంది. ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సహా 50కి పైగా దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

BioAsia-2023: 2030 నాటికి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ.20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందనీ, 2028 నాటికి రాష్ట్రం 100 బిలియన్ డాలర్లకు (8.2 లక్షల కోట్లు) చేరుకోవాలనే లక్ష్యాన్ని సాధించే దిశ‌గా ముందుకు సాగుతున్నద‌ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 80 బిలియన్ డాలర్లకు (రూ.6.56 లక్షల కోట్లు) చేరుకుందనీ, మిగిలినది 2025 నాటికి సాధిస్తామని మంత్రి వివ‌రించారు. బయో ఏషియా 2023 20వ స‌ద‌స్సులో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని వెల్లడించారు.

వివ‌రాల్లోకెళ్తే.. రాష్ట్ర ప్రతిష్టాత్మక పరిశ్రమ కార్యక్రమం బయో ఏషియా 2023 20వ స‌ద‌స్సును మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభ‌మైంది . ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు సహా 50కి పైగా దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం దేశ సగటు 14 శాతంతో పోలిస్తే అధికంగా 23 శాతం వృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ, భారత్ లలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధిలో బయో ఏషియా నిరంతరం కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ అద్భుతమైన వేదిక 100 కి పైగా దేశాల నుండి హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ నాయకులను నిరంతరం ఆకర్షించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 

Scroll to load tweet…

కోవిడ్-19 మహమ్మారి పరస్పర సహకార ప్రాధాన్యతను, ప్రజల శ్రేయస్సుపై దాని ప్రభావాన్ని నిరూపించింద‌నీ, మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి ప్రపంచం ఏకతాటిపైకి వచ్చిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా ప్రాముఖ్యతను గుర్తించడంలో, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. నిరంతరం అభివృద్ధి చెందుతున్న జీనోమ్ వ్యాలీ, విస్తరిస్తున్న మెడ్ టెక్ పార్కు, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ ఉన్న ఏకైక నగరం హైదరాబాద్ అని తెలిపారు. 

ఈ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వ క్రియాశీల అమలుతో తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా గుర్తింపుపొందడంతో పాటు జాతీయంగా, అంతర్జాతీయంగా సానుకూల ఆరోగ్య ఫలితాల్లో తెలంగాణ వాటాను, సహకారాన్ని పెంచిందన్నారు. ప్రస్తుత సానుకూల ప‌రిస్థితుల దృష్ట్యా 2025 నాటికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్ణీత సమయం కంటే ఐదేళ్ల ముందే చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గత ఏడేళ్లలో రాష్ట్రం 3 బిలియన్ డాలర్లకు పైగా నికర కొత్త పెట్టుబడులను ఆకర్షించగలిగిందనీ, ఇదే సమయంలో తెలంగాణ మొత్తం 4.5 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని మంత్రి వెల్ల‌డించారు.

ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్ గా మార్చడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. ఇందులో కీలకమైన అంశం లైఫ్ సైన్సెస్ సేవల రంగం వృద్ధి. ఇన్నోవేషన్ జర్నీలో టాప్ 10 ఫార్మా కంపెనీలతో సహా ప్రపంచవ్యాప్తంగా 1,000కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఇప్పటికే సేవలందిస్తున్నామని తెలిపారు.