Asianet News TeluguAsianet News Telugu

పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి హరీష్‌రావు సంధించిన ప్రశ్నలివే...

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి  తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు 12 ప్రశ్నలు సంధించారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై  ఆయన మండిపడ్డారు.

Telangana minister harishrao open letter to pcc chief Uttamkumar reddy
Author
Hyderabad, First Published Oct 9, 2018, 5:12 PM IST

హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి  తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు 12 ప్రశ్నలు సంధించారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడంపై  ఆయన మండిపడ్డారు.  చంద్రబాబునాయుడు మద్దతుపై ఆధారపడి తెలంగాణలో  ప్రభుత్వం ఏర్పాటైతే  తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని  ఆయన  అభిప్రాయపడ్డారు. 

మంగళవారం నాడు  టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో  హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.ఈ మేరకు 12 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ఉత్తమ్‌‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు  12 ప్రశ్నలను హరీష్ రావు విడుదల చేశారు.

ఉత్తమ్‌కుమార్ రెడ్డికి  హరీష్ రావు విడుదల చేసిన  12 ప్రశ్నలివే...


1. తెలంగాణ వ్యతిరేక వైఖరిని విడనాడుతానని చంద్రబాబు నుంచి హామీ తీసుకున్నారా?


2. 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుతానని కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందా?


3. సీలేరు ప్రాజెక్టు వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు ఏమైనా ఒప్పుకున్నారా? ప్రాజెక్టుకు బదులుగా తెలంగాణకు నష్ట పరిహారం ఏమైనా ఇచ్చేందుకు చంద్రబాబుతో ఏమైనా ఒప్పందం చేసుకున్నారా?


4. హైకోర్టు సత్వర విభజన సహా, ప్రభుత్వ సంస్థల విభజనలో స్తంభన తొలగించడానికి చంద్రబాబు నుంచి ఏమైనా హామీ తీసుకున్నారా?


5. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కృష్ణా నీటిలో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటా కేటాయించడానికి తమకు అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పించగలరా?


6. తెలుగు జాతి అని మాట్లాడే చంద్రబాబు.. హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు మంచినీళ్లు ఇవ్వడానికి తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారని, అలా తాను ఫిర్యాదు చేయడం తప్పే అని చంద్రబాబు ఏమైనా పశ్చాతాపం వ్యక్తం చేశారా?


7. విద్యుత్ శాఖలోని 1200 మంది ఆంధ్రా ఉద్యోగులను విధుల్లో చేర్చుకుంటామని, తెలంగాణపై ఆర్థిక భారం తొలగిస్తామని చంద్రబాబుతో చెప్పిస్తారా? కోర్టు కేసులను ఉపసంహరింపచేస్తారా?


8. నిజాం కాలం నాటి ఆస్తులు తెలంగాణకే తప్ప. ఆంధ్రప్రదేశ్‌కు ఉండదనే సత్యాన్ని చంద్రబాబు అంగీకరించారా? ఈ విషయంలో వేసిన కేసులను ఉపసంహరించుకుంటామని ఒప్పందం ఏమైనా చేసుకున్నారా?


9. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం రామాలయం సహా, తెలంగాణలో లక్షల ఎకరాలు నీట మునుగుతాయి. ప్రాజెక్టు డిజైన్ మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరేంటి? చంద్రబాబు వైఖరి ఏంటి? తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయగలరా?


10. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబుతో చెప్పిస్తారా? పాలమూరు రంగారెడ్డిపై చంద్రబాబు వైఖరి ఏంటి? ఆయన వైఖరి చెప్పకుండా పొత్తుపెట్టుకుంటే అది తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కాదా?


11. కాళేశ్వరం, తమ్మిడిహట్టి, సీతారామ, తుపాకుల గూడెం, దేవాదుల, పెన్‌ గంగ, రామప్ప-పాకాల లింకేజీ తదితర ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను చంద్రబాబు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారా? ఆ ప్రాజెక్టులు నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పగలరా?


12. ఇకపై తెలంగాణకు వ్యతిరేకంగా వాదించనని, ప్రాజెక్టులు, ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన, హైకోర్టు విభజన వంటి విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తానని ఒప్పుకున్నారా? అంటూ హరీష్ రావు ప్రశ్నలు సంధించారు.
 
మహాకూటమి ఏర్పాటు చేసుకుని, కామన్ మినిమమ్ ఎజెండా రూపొందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, ఈ కామన్ మినిమన్ ఎజెండాలో తాను ప్రశ్నించిన 12 అంశాలుంటాయా? ఉండవా? అనేది స్పష్టం చేయాలని ఉత్తమ్‌ను హరీష్ డిమాండ్ చేశారు. 

కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ పై  పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్, టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు సంతకాలు చేస్తారా? అని ప్రశ్నించారు.
 
ఈ అంశాలన్నింటిపై తెలంగాణ ప్రజలకు ఉత్తమ్ స్పష్టతనివ్వాలని, ప్రజల్లోని భయాందోళనలను తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తేనే ప్రజాప్రతినిధులమయ్యామన్న హరీష్ రావు.. ఇక్కడి ప్రజాప్రతినిథుల లక్ష్యం తెలంగాణ ప్రయోజనాలు కాపాడడమే కావాలన్నారు.

కేవలం అధికారం కోసమే పొత్తులు పెట్టుకుంటాం... రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు భావన ఉంటే ప్రజలను వంచించడమేనని పేర్కొన్నారు. దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

 

సంబంధిత వార్తలు

చంద్రబాబు ఎప్పటికైనా ఆంధ్రబాబే: హరీష్ రావు

 


 

Follow Us:
Download App:
  • android
  • ios