మహాకూటమి వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు.
హైదరాబాద్: మహాకూటమి వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు.. భేషరతుగా పెట్టుకొందా... లేదా షరతులతో పొత్తు పెట్టుకొందా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు 12 ప్రశ్నలను పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు.
హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభపక్షకార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ నిరంతరం పోరాటం చేస్తోంటే... చంద్రబాబునాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా ప్రతి విషయంలో పోరాటం చేస్తున్నారని హరీష్ రావు చెప్పారు.
2004లో కాంగ్రెస్ పార్టీతో, 2009 ఎన్నికల్లో టీడీపీతొ పొత్తు పెట్టుకొన్న సమయంలో కూడ ఈ రెండు పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొన్న తర్వాతే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొన్నట్టు హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణకు నష్టమేనని ఆయన తెలిపారు.
గతంలో తెలంగాణలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకొన్నారా.... లేదా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు పొత్తు మీద ఆధారపడి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైతే తెలంగాణకు లాభం కంటే నష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరివరకు చంద్రబాబునాయుడు ప్రయత్నించారని హరీష్ రావు గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ఎప్పటికైనా ఆంధ్రబాబేనని హరీష్ రావు విమర్శించారు. తెలుగుజాతి అంటూ బాబు చెబుతుంటారు. తెలుగుజాతి అనేది ఎన్టీఆర్‌కు చెల్లుతోందన్నారు. బాబుకు ఇది వర్తించదన్నారు.
ఆనాడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందున సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీ తీసుకోవడం వల్ల ఏడు మండలాల్లో భాగంగా విలీనంచేసుకోవడం వల్ల రోజుకూ కోటి రూపాయాలను నష్టపోతున్నట్టు హరీష్ రావు చెప్పారు.
