బీజేపీ నేతలకు ఏదో శాపం వుందని .. అందుకే వాళ్లు నిజాలు మాట్లాడరని ఎద్దేవా చేశారు తెలంగాణ ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. రాహుల్ గాంధీ ఏ హోదాలో డిక్లరేషన్లు ఇస్తారని హరీశ్ ప్రశ్నించారు.
బీజేపీ (bjp) నేతలపై మండిపడ్డారు టీఆర్ఎస్ (trs) అగ్రనేత, మంత్రి హరీశ్ రావు (harish rao) . ఆదివారం సిద్ధిపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజం మాట్లాడితే బీజేపీ వాళ్ల తల వేయి ముక్కలవుతుందనే శాపం ఉన్నట్టుందని, అందుకే అబద్ధం తప్ప నిజాలు మాట్లాడరంటూ దుయ్యబట్టారు. పాలమూరు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డా అబద్ధాల పురాణం మరోసారి చదివి వెళ్లారని, బీజేపీ మంత్రులకు, నాయకులకు మధ్య సమన్వయ లోపం బయటపడిందని హరీశ్ ఎద్దేవా చేశారు.
కేంద్ర బీజేపీలో ఆధిపత్య పోరు కనిపిస్తుందని, గడ్కరీ, ఇతర మంత్రులు ఒక మాట చెబితే.. నాయకులు మరోమాట చెబుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పార్లమెంట్‌లో ఓ మాట.. పాలమూరులో ఇంకోపాట పాడిందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా పాలమూరు సభలో నడ్డా ప్రస్తావించిన ఐదు విషయాలపై మంత్రి స్పందించారు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో (kaleshwaram project) అవినీతి జరిగిందని, కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు (palamuru lift irrigation) పూర్తి చేస్తాం’ అన్నారనీ, ఇవన్నీ అబద్ధాలేనని హరీశ్ మండిపడ్డారు.
ఆత్మవంచన చేసుకోవడంలో బీజేపీ నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దాదాపు 600 కార్యక్రమాలు అమలు చేస్తోందని హరీశ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కనీసం 60 కార్యక్రమాలైనా అమలు చేస్తోందా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాటిలో సగమైనా అమలవుతున్నాయా అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అంటున్నారని.. మా పథకాల్లో మీ వాటా ఎంతో చెప్పాలని హరీశ్ రావు నిలదీశారు.
కేంద్రం నుంచి వచ్చే సాయం సున్నా అనీ.. అయినా సరే గప్పాలు కొడుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఎలాంటి సాయం చేయకపోగా, మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన, రాజ్యాంగపరమైన నిధులు కూడా కేటాయించడం లేదని హరీశ్ ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుందని, పరిమితికి లోబడి అప్పులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి నయాపైసా పుట్టకుండా కుట్రలు చేస్తున్నారు ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం పరిమితికి మించి రుణాలు అందేలా చూస్తుందని, సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఆర్‌బీఐ నుంచి నేరుగా నిధులు తీసుకుందని హరీశ్ దుయ్యబట్టారు.
బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేస్తామని నడ్డా అంటున్నారని.. కానీ ఇదే పాలమూరులో 2014 ఎన్నికల సభలో నరేంద్ర మోదీ (narendra modi) మాట్లాడారనీ హరీశ్ ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టకుండా సోనియా-రాహుల్ పదేళ్లు నిద్రపోయారంటూ ఆయన దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. పాలమూరు ప్రాజెక్టుకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని హరీశ్ నిలదీశారు. అదే ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం జాతీయ ప్రాజెక్టుకు, పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్ర జాతీయ ప్రాజెక్టు చేపట్టి నిధులు ఇచ్చారని మంత్రి ఎద్దేవా చేశారు.
అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi telangana tour) తెలంగాణ పర్యటన పైనా హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ఏ హోదాలో డిక్లరేషన్ ఇస్తారో అర్థం కావడం లేదన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లో అవి అమలు అవుతున్నాయా ? అని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చిన ప్రభుత్వాలను నిలబెట్టుకోలేని అసమర్థుడు రాహుల్ గాంధీ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహి.. చంద్రబాబు చెప్పులు మోసిన వారు కాంగ్రెస్‌లో ఉన్నారని, కేంద్రంలోని బీజేపీపై పోరాడలేని అసమర్థ పార్టీ కాంగ్రెస్ అంటూ హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
