హైదరాబాద్:కరోనా పరీక్షల నిర్వహణకు గాను నిమ్స్ లో కోబాస్ 8800 యంత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్  శుక్రవారం నాడు ప్రారంభించారు.

కోబాస్ 8800 యంత్రాన్ని తొలిసారిగా కొనుగోలు చేసినట్టుగా మంత్రి తెలిపారు. ఈ యంత్రం ద్వారా  ప్రతి రోజూ  4 వేల ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో ప్రతి రోజూ 20 వేల కరోనా టెస్టులు చేసే సామర్ధ్యం ఉందని మంత్రి వివరించారు. త్వరలోనే రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

గాంధీ ఆసుపత్రిలో ఇతర సాధారణ సేవలను కూడ కొనసాగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల జీతాల పెంపు విషయమై కసరత్తు చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.

తెలంగాణలో కరోనా పరీక్షలను ఎందుకు తగ్గించారని హైకోర్టు ఈ నెల 24వ తేదీన ప్రశ్నించిన విషయం తెలిసిందే.