Telangana Local body elections: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి.
తొలి విడత షెడ్యూల్
మొదటి విడతకు సంబంధించిన నామినేషన్‌ల స్వీకరణ గురువారం (ఈరోజు) ప్రారంభమైంది.
* నామినేషన్ల చివరి తేదీ: అక్టోబర్ 11
* నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 12
* నామినేషన్ల ఉపసంహరణ గడువు: అక్టోబర్ 15
* పోలింగ్ తేదీ: అక్టోబర్ 23న మొదటి విడత పోలింగ్ జరుగుతుంది.
ఈ విడతలో మొత్తం 292 జడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ నామినేషన్లు మండల కార్యాలయాల్లో, జడ్పీటీసీ నామినేషన్లు జిల్లా కేంద్రాల్లో స్వీకరిస్తున్నారు.
రెండో విడత వివరాలు
రెండో విడత పోలింగ్ అక్టోబర్ 27న జరగనుంది.
* నామినేషన్ ప్రారంభం: అక్టోబర్ 13
* నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 16
* ఉపసంహరణకు గడువు: అక్టోబర్ 19
రెండు విడతల ఫలితాలను నవంబర్ 11న ప్రకటించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
అభ్యర్థుల ఖర్చు పరిమితి
ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేయగల గరిష్ట పరిమితిని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
* జడ్పీటీసీ అభ్యర్థి: రూ.₹4 లక్షల వరకు
* ఎంపీటీసీ అభ్యర్థి: రూ. 1.5 లక్షలు వరకు
* సర్పంచ్ అభ్యర్థి: రూ. 2.5 లక్షలు వరకు
ఈ పరిమితిని మించితే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం, గరిష్ట ఖర్చు పరిమితిని దాటిన వారు మూడు సంవత్సరాలపాటు పోటీ చేయడానికి అనర్హులు అవుతారు లేదా గెలిచినా పదవి రద్దు అవుతుంది.
ఖర్చు నివేదిక తప్పనిసరి
ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపే అభ్యర్థులు తమ ఖర్చుల తుది నివేదిక సమర్పించాలి. ఈ నివేదిక ఇవ్వకపోతే కూడా అభ్యర్థిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
