Telangana : స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ ను అడ్డుకోవడానికి న్యాయస్థానం అంగీకరించలేదు.
Telangana Local Body Elections : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బిసి (Backward Classes) రిజర్వేషన్ల పెంపు వివాదాస్పందంగా మారింది... ఇది చట్టబద్దంగా జరగలేదని ఆరోపిస్తూ పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇలా రిజర్వేషన్ల పెంపు జీవోను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్స్ అన్నింటినీ కలిపి ఒకేసారి విచారణ జరిపింది హైకోర్ట్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్. వాడివేడిగా సాగిన వాదోపవాదాలను విన్న న్యాయస్థానం మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని భావించింది. దీంతో విచారణను రేపు (గురువారం) మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.
గురువారమే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్
ఇవాళ బిసి రిజర్వేషన్లపై వాదన ముగియడంతో రేపు (గురువారం) మరిన్ని వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ తరపున ఏజీ (అడ్వకేట్ జనరల్) కోరారు. దీంతో బిసి రిజర్వేషన్లు ఏటూ తేల్చకుండానే విచారణను వాయిదా వేసింది న్యాయస్థాపం.అయితే రేపు స్థానిక సంస్ధల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని... న్యాయస్థానం బిసి రిజర్వేషన్లు ఓ నిర్ణయం తీసుకునేవరకు దీన్ని ఆపాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. కానీ కోర్టు ఈ వాదనను పట్టించుకోలేదు... కాబట్టి రేపు యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.
అసలేంటి బిసి రిజర్వేషన్ వివాదం :
రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం బిసి రిజర్వేషన్ ను 42 శాతానికి పెంచింది. దీంతో ఎస్సి, ఎస్టి రిజర్వేషన్లు కలుపుకుని మొత్తం 60 శాతానికి చేరాయి. దీంతో ఈ రిజర్వేషన్ పెంపు కోసం తీసుకువచ్చిన జీవో 67 చట్టవిరుద్దమని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మళ్లీ వివాదం మొదలైంది.
ఇలా బిసి రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన పిటిషన్లు అన్నింటిని కలిపి ఒకేసారి విచారణ జరుపుతోంది హైకోర్టు. న్యాయస్థానం తీర్పు ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుంది... కాబట్టి షెడ్యుల్ ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతాయా అన్న అనుమానం ప్రజల్లో నెలకొంది. గురువారం హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది… స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు అడ్డుకోకపోవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.
