హైదరాబాద్: దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ మీద భారీగానే పడుతోంది. కాంగ్రెసుకు తెలంగాణలో వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా, గూడూరు నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 

గూడూరు నారాయణరెడ్డి ఎఐసిసి సభ్యుడిగా, తెలంగాణ పీసీసీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెసు సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.

ఇటీవలి కాలంలో కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో పరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న విజయశాంతి సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బిజెపిలో చేరబోతున్నారు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మాజీ ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ బిజెపిలో చేరారు. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కూడా బిజెపిలో చేరారు. తెలంగాణలో బలోపేతం కావడానికి బిజెపి కాంగ్రెసు నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. తెలంగాణలో బిజెపి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న స్థితిలో ఈ వలసలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి.