తెలంగాణ 'కంటి వెలుగు’.. కోటి 58 లక్షల కంటి పరీక్షలు పూర్తి
Telangana’s eye test programme: తెలంగాణ కంటి పరీక్షల కార్యక్రమం 'కంటి వెలుగు' కింద 1.58 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నారు. 22,21,494 మందికి రీడింగ్ అద్దాలు అందజేశారు.
Free eye test camps: తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు చేసారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22 లక్షల 21 వేల 494 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ అందజేసారు. ఇందులో 74లక్షల 42 వేల 435 మంది పురుషులు, 83 లక్షల 73 వేల 097 మంది స్త్రీలు, 10,955 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. కోటి 18 లక్షల 26 వేల 614 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్ల వల్ల కంటి సమస్యల పై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజుల కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు 96.21 శాతం కంటి పరిక్షలు పూర్తి అయ్యాయి.
ఇప్పటి వరకు 89 రోజుల పనిదినాలల్లో ఒక కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసుకొని అనుకున్న లక్ష్యానికి మించి రెండు కోట్లకు చేరుకునే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. డీఎంహెచ్వోలు, డిప్యూటీ డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆపీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, కంటి వైద్యులు, సూపర్వైజర్లు, ఏన్ఎలు, ఆశాలు, డీఈవోలు సహా, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. ఈ పథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పలు శాఖల అధికారులు విశేష కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.
నివారించదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నది. 2018లో నిర్వహించిన, మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా, కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సారి 100 పని దినాల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిష్టాత్మకమైన కంటి వెలుగు కార్యక్రమం పురోగతిపై రోజువారీగా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారు. ఎంత మందికి పరీక్షలు నిర్వహించారు, ఎంత మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు అనే అంశాలు ప్రతి రోజు తెలుసుకుంటున్నారని అధికారులు తెలిపారు. స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చూస్తున్నారు. క్యాంపుల నిర్వహణ ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. సిబ్బందికి అవసరమైన భోజన, వసతి, వాహన సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.