Asianet News TeluguAsianet News Telugu

ఎపి సర్కారే నయమంటున్న తెలంగాణ నిరుద్యోగులు

  • టిఆర్ఎస్ సర్కార్ పై తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం
  • ఎపిలో రెండో డిఎస్సీకి రెడీ అవుతుంటే ఇక్కడ వేయరా?
  • త్వరలో డిఎస్సీ అంటూ  ఎంతకాలం ఊరిస్తారు?
Telangana job aspirants  jealous about their Andhra counterparts

తెలంగాణ టీచర్ అభ్యర్థులు కేసిఆర్ సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ సర్కారు టీచర్ పోస్టుల భర్తీ చేపట్టలేదు. టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ సర్కారు తీవ్ర వ్యతిరేక భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో బిఇడి, డిఇడి చదివి టీచర్ పోస్టు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు టిఆర్ఎస్ సర్కారుపై కసితో రగిలిపోతున్నారు. టెట్ కూడా పాసై ఎప్పుడు డిఎస్సీ వేస్తారా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సర్కారు ప్రకటనలు పుండు మీద కారం చల్లినట్లు ఉంటున్నాయి. పదే పదే మంత్రి కడియం శ్రీహరి త్వరలో డిఎస్సీ అంటూ ఊరిస్తున్నారు తప్ప ఆచరణలో పని జరగడంలేదు.

మరోవైపు అదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఎపిలో ఇప్పటికే 9వేల పైచిలుకు పోస్టులతో ఒక డిఎస్సీ నిర్వహించారు. మరోసారి డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎపి సర్కారు సన్నద్ధమవుతోంది. ఈ దఫా 20వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎపి సర్కారు చెబుతోంది. మరోవైపు ఈనెల 21వ తేదీ అంటే రేపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీ కోసం పరీక్ష  జరగబోతున్నది. అంటే విద్యారంగంలో పోస్టుల భర్తీ పట్ల ఎపి సర్కారు కొద్దో గొప్పో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో తెలంగాణ సర్కారు ఎందుకు డిఎస్సీ జరపకుండా అటు పేద, మధ్యతరగతి విద్యార్థులకు, ఇటు టీచర్ అభ్యర్థులకు అన్యాయం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. సర్కారు పాఠశాలల్లో బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే అధికంగా ఉన్నారు. వారంతా ప్రయివేటులో చదివేందుకు ఫీజులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అర్హులైన అభ్యర్థులు కూడా ఆందోళనలో ఉన్నారు.

కానీ ఏపూటకు ఆ పూట త్వరలో డిఎస్సీ, త్వరలో డిఎస్సీ అంటూ తెలంగాణ సర్కారు నిరుద్యోగులను ఆశల పల్లకీలో ఊరేగిస్తున్నది. డిఎస్సీ వేసేదెప్పుడో మా బతుకులు బాగుపడేదెప్పుడో అని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. త్వరలో డిఎస్సీ అనగానే వేలకు వేలు తగలబెట్టి కోచింగ్ లు తీసుకుంటున్నామని, తీరా తుస్సుమనిపించేసరికి హుసూరుమంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో తొలి కేబినెట్ సమావేశం 20వేల టీచర్ పోస్టుల భర్తీకి ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వానికి వయసు పెరుగుతుండగా పోస్టుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 20వేల నుంచి 16 వేలకు పడిపోగా రాను రాను ఇప్పుడు ఆ పోస్టుల సంఖ్య 8వేలకు పడిపోయింది. అయినప్పటికీ ఆ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ సర్కారుకు మనసు రావడంలేదు.

ఈ నేపథ్యంలో టీచర్ అభ్యర్థులు ఒక ఫొటోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఎపిలో ఇప్పటికే ఒక డిఎస్సీ నిర్వహించి మరో డిఎస్సీకి రెడీ అవుతున్నారని, తెలంగాణలో మాత్రం గడిచిన మూడేళ్లుగా త్వరలో డిఎస్సీ అంటూ ఊరిస్తున్నారని ఇద్దరు విద్యాశాఖ మంత్రుల ఫొటోలను జత చేసి పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios