ఆదివారం అమీర్‌పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో మరణించిన మౌనిక కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రోఫెసర్ కోదండరామ్. సోమవారం గాంధీ ఆసుపత్రి మార్చురీ వద్ద మౌనిక కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.

మౌనిక చనిపోయి 24 గంటలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని మెట్రో స్టేషన్‌లలో నిపుణులతో పర్యవేక్షించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు.

ఈ ప్రమాదంపై తాను మెట్రో అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. కాగా కేపీహెచ్‌బీకి చెందిన మౌనిక అనే వివాహిత ఆదివారం సాయంత్రం వర్షం పడుతుండటంతో అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ వద్ద పిల్లర్ కింద నిరీక్షిస్తున్నారు.

ఆ సమయంలో పిల్లర్‌పైన ఉణ్న మెట్రో కాంక్రీటు అంచులు పెచ్చులూడి తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి మౌనిక తలపై పడ్డాయి. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలారు.

రక్తపు మడుగులో ఉన్న మౌనికను స్ధానికులు, మెట్రో సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

హైదరాబాద్ మెట్రో స్టేషన్ పెచ్చులూడిపడి లేడీ టెక్కీ మృతి