Asianet News TeluguAsianet News Telugu

జనవరిలో కోదండరాం కొత్త పార్టీ

  • పార్టీ పేరుపై ఇప్పటికే స్పష్టత
  • పార్టీ పెట్టాలంటూ అన్ని వర్గాల నుంచి వత్తిడి
  • అంతకంటే ఎక్కువగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచే
  • కొలువుల కొట్లాట సభ తర్వాత వేగంగా పరిణామాలు
Telangana jac chairmen kodandaram will launches new political party

తెలంగాణ రాజకీయ తెర మీద మరో కొత్త పార్టీ కొలువుదీరనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో పార్టీ జనం ముందుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ జెఎసి రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా సీరియస్ గానే కసరత్తు జరుపుతున్నది. ఇప్పటికే పార్టీ పేరుపై ఒక అవగాహనకు వచ్చింది జెఎసి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే.. తెలంగాణ జెఎసి పై రాజకీయ పార్టీ పెట్టాలంటూ అన్ని వర్గాల వత్తిడి వస్తున్నది. అంతకంటే ఎక్కువగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన వత్తిడి వస్తున్నది. ఇప్పటికే జెఎసి ఛైర్మన్ కోదండరాం తో 18 మంది టిఆర్ఎస్ యువ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారంతా జెఎసి తరుపున పార్టీ స్థాపిస్తే వెంటనే టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి జెఎసి పార్టీలో చేరిపోతామంటూ జెఎసి ప్రతినిధులకు వర్తమానాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.

అవును తెలంగాణలో కోదండరామ్ రాజకీయ పార్టీ వస్తున్నది. తెలంగాణ జెఎసి తలపెట్టిన కొలువులకై కొట్లాట సభ నవంబర్ 30న పూర్తి చేసుకున్న వెంటనే తెలంగాణ జెఎసి విస్రృత స్థాయి సమావేశం జరపనున్నారు. ఈ భేటీ డిసెంబరు నెలలోనే ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ సమావేశంలోనే పార్టీ ఏర్పాటుపై అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నరు. అయితే పార్టీ పేరుపై ఇప్పటికే జెఎసి సభ్యులు ఒక అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ కి ఏదో ఒక కొత్త పేరు పెట్టే కంటే జెఎసి అనే పేరునే పార్టీకి కూడా పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. జెఎసి పేరుపై ఇప్పటికే ఏకాభిప్రాయంతో సూత్రప్రాయ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జెఎసి పేరు తెలంగాణ వ్యాప్తంగా పాపులర్ గా మారిన నేపథ్యంలో అదే పేరును పార్టీకి కూడా కంటిన్యూ చేయాలన్న ఆలోచనలో జెఎసి ఉంది. కొత్త పార్టీకి కొత్త పేరు పెట్టినా జనాల్లోకి తీసుకుపోవడానికి చాలా సమయమే పడుతుంది కాబట్టి జెఎసి పేరునే దాదాపుగా ఖరారు చేసే చాన్స్ ఉందంటున్నారు. అయితే డిసెంబరు 9,10 తేదీల్లో నల్లగొండ జిల్లాలో అమరుల స్పూర్తి యాత్ర జరగనుంది. ఆ సభ తర్వాతే పార్టీ ఏర్పాటు విషయమై విస్రృత స్థాయి సమావేశం ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఇక జనవరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అదే సభలో పార్టీని ప్రారంభించి అధికారికంగా ప్రారంభించే అవకాశాలున్నట్లు జెఎసి ప్రతినిధులు అంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో టిఆర్ఎస్ కు ధీటైన ప్రత్యర్థిగా తెలంగాణ జెఎసి నిలిచింది. అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలను టిఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో కుదేలు చేసింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను చీల్చి తనవైపు తిప్పుకుంది. ఇక తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షాన్ని ఏకంగా తనలో విలీనం చేసుకుంది. సిపిఐ శాసనసభ్యుడిని పార్టీలో చేర్చుకుంది. బిజెపి, సిపిఎం, ఎంఐఎం సభ్యులను మాత్రమే వదిలింది. మిగతా అన్ని పక్షాలకు టిఆర్ఎస్ ఆకర్ష్ దెబ్బ తగిలింది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు మూడేళ్ల కాలంలో ఏనాడూ ప్రభుత్వంపై గట్టిగా పోరాడిన దాఖలాలు లేవు. ఏదో పైపైకి పోరాటాలే నడిపిన పరిస్థితి ఉంది. సర్కారును కదిలించేలా కార్యాచరణ కాంగ్రెస్ తీసుకోలేకపోయింది. ఆ పార్టీలో నాయకులు ఎక్కవ పని తక్కువ అన్న భావన ఉంది. ఉన్న నాయకుల్లో ఎక్కువ మంది నేతలు అధికార టిఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నారన్న అపవాదు కూడా ఉంది. ఈ నేపథ్యంలో టిడిపి నుంచి రేవంత్ రెడ్డి ఆ పార్టీలో చేరడం కొంత జోష్ వచ్చినట్లు కనబడుతున్నది. ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి మింగుడుపడని రీతిలో, కొరకరాని కొయ్యగా మారింది తెలంగాణ జెఎసి. జెఎసి ఏ కార్యక్రమం చేసినా సర్కారు అగ్గిమీద గుగ్గిలమైన పరిస్థితి ఉంది. జెఎసి సభలకు అనుమతివ్వకపోవడం, కోదండరాం ఇంట్లోంచి కాలు బయటపెట్టగానే అరెస్టు చేయడం లాంటివాటివల్ల జెఎసి అంటే సర్కారులో ఎంతటి ఆందోళన ఉందో అర్థమవుతున్నది.

ఇక రాజకీయ శక్తిగా మారాలంటూ అన్ని వర్గాల నుంచి జెఎసిపై వత్తిడి తీవ్రమవుతున్నది. అంతకంటే ఎక్కువగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం జెఎసి పై వత్తిడి పెడుతున్నారు. 18 మంది యువ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు జెఎసితో టచ్ లో ఉన్నారని, వారంతా జెఎసి పార్టీ పెడితే వచ్చి చేరిపోతామన్న సంకేతాలిచ్చినట్లు జెఎసి ప్రముఖుడు ఒకరు ‘ఏషియానెట్’ కు చెప్పారు. టిఆర్ఎస్ లో గౌరవం లేదన్న భావనలో వారు ఉన్నట్లు చెబుతున్నారు. కనీసం ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా ఉందని, తమను పార్టీలో పట్టించుకునే నాథుడే కరువైండని సదరు ఎమ్మెల్యేలు వాపోతున్నారట. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో కోదండరాం పార్టీ ప్రకటించగానే మూకుమ్మడిగా టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి జెఎసి పార్టీలో చేరే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. ఇక పార్టీలో కిందిస్థాయి ఎంపిటిసిలు, ఎంపిపిలు, జెడ్పీటిసిల పరిస్థితి మరీ దారుణంగా ఉందని చెబుతున్నారట. వారికి కనీస గౌరవం కూడా పార్టీలో దక్కడంలేదని, వారందరినీ తమ వెంట తీసుకుని వస్తామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నారట. టిఆర్ఎస్ లో నియంతృత్వ పోకడలను జీర్ణించుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారట. ఈ నేపథ్యంలో తెలంగాణ జెఎసి రాజకీయ పార్టీ గా ముందుకొస్తున్న నేపథ్యంలో జనవరి తర్వాత తెలంగాణ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశాలున్నాయని జెఎసి నేతలు అంచనాలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios