సోషల్ మీడియా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మాధ్యమం. దీని ద్వారా లాభాలెన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలు ప్రచారమై అమాయకులు బలవుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలకు ఇదో సమస్యగా మారింది. అయితే ఈ ఫేక్ వార్తల ప్రచారానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ఐటీ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. 

చిన్నారుల ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని, దొంగల ముఠాలని, నరమాంస భక్షకుల ముఠాలు తిరుగుతున్నాయి...జాగ్రత్తగా ఉండండి... అంటూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా  మెసేజ్ లు స్ప్రెడ్ అయ్యాయి. వీటిని నిజమని నమ్మి తమ ప్రాంతాల్లో కొత్తగా, అనుమానాస్పదంగా కనిపించే వారిని స్థానికలు చితబాదుతున్నారు. ఇలాంటి ఘటనల్లో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 30 మంది అమాయకులు బలైనట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలే తెలంగాణ రాష్ట్రంలోనూ సంభవించాయి. వీటి వల్ల శాంతి భద్రతలకు భంగం కలగడంతో పాటు, సామాన్యులకు రక్షణ లేకుండా పోతోంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య స్పూర్తికి కూడా ఈ దుర్ఘటనలు మచ్చ తెస్తున్నాయి. 

ఈ ఘటనలకు దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఐటీ శాఖ ప్రముఖులతో ఈ నెల 7వ తేదీన రౌండ్ టెబుల్ సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఐటీ, ఎలక్ట్రానిక్ ఆండ్ కమ్యూనికేషన్, ఇన్పర్మేషన్ ఆండ్ పబ్లిక్ రిలేషన్, పోలీస్ శాఖలకు చెందిన  అధికారులతో పాటు తెలుగు అకాడమీ మరియు వివిధ మీడియా సంస్థల సభ్యులు, సామాజిక కార్యకర్తలకు పాల్గొననున్నారు. వారందరికి తెలంగాణ ఐటీ శాఖ తరపున అధికారిక ఆహ్వనం అందింది.
 
సోషల్ మీడియాలో ఈ అసత్య వార్తల ప్రచారాన్ని ఆపడం ఎలా? అన్న అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. దీనిపై ప్రముఖులంతా కలిసి సుధీర్ఘంగా చర్చించి ఐటీ శాఖ తో పాటు వివిధ శాఖలకు తమవంతు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు.