Local Body Polls: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది. సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు జరగనున్నాయి.

Telangana Local Body Polls: తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో నంబర్ 9 ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పరిమితిని 50% నుండి తొలగించి, 42% బీసీలకు కేటాయించనున్నట్లు పేర్కొంది. మంత్రివర్గం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం

హైకోర్టు గడువు ప్రకారం సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉండటంతో ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశాయి. శనివారం ఉదయం 11 గంటలకు ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యే సమీక్షా సమావేశం జరుగనుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.

గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తు

పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు చైర్‌పర్సన్ ఎన్నికలు జరపనున్నారు. జిల్లాస్థాయి అధికారులు ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు

హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి స్పష్టమైన గడువు విధించింది. మొదటి 30 రోజుల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి, తర్వాత 60 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. పంచాయతీల పదవీకాలం జనవరి 31, 2024న ముగిసినా ఎన్నికలు జరగకపోవడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. రాజ్యాంగపరమైన బాధ్యతలను గుర్తు చేస్తూ సెప్టెంబర్ 30, 2025లోపు ఎన్నికలు జరగాలని గడువు విధించింది.

త్వరలోనే సర్పంచ్ ఎన్నికల శంఖారావం

ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల జీవో విడుదల కావడంతో ఎన్నికలకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, పంచాయతీరాజ్ సిబ్బంది అందరూ సిద్ధంగా ఉన్నారు. శనివారం సమావేశం అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల శంఖారావం త్వరలోనే మోగనుంది.