- Home
- Telangana
- Rain Alert : తెలంగాణకు వాయుగుండం వార్నింగ్ .. ఈ రెండు జిల్లాల్లో అల్లకల్లోలమే, రెడ్ అలర్ట్
Rain Alert : తెలంగాణకు వాయుగుండం వార్నింగ్ .. ఈ రెండు జిల్లాల్లో అల్లకల్లోలమే, రెడ్ అలర్ట్
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెలంగాణ పాలిట పెద్ద గండంగా మారింది. దీని ప్రభావంతో ఇప్పటికే కుండపోత వానలు పడుతుండగా ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఓ రెండు జిల్లాలకయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు.

తెలంగాణలో భారీ వర్షాలు
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణను మరోసారి కుండపోత వానలు భయపెడుతున్నాయి. ఇటీవల కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన అతిభారీ వర్షాలతో భీకర వరదలు సంభవించిన విషయం తెలిసిందే. వీటిని మరిచిపోకముందే ఇప్పుడు పలు జిల్లాల్లో అలాంటి పరిస్థితులే నెలకొన్నారు. ఇవాళ (సెప్టెంబర్ 26, శుక్రవారం) ఉదయం నుండి రాజధాని హైదరాబాద్ తో సహా అనేక జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది... కొన్నిచోట్ల అయితే భారీ నుండి అత్యంత వర్షాలు కురుస్తున్నాయి.
ఈ రెండుమూడు రోజులు కుండపోతే
ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం బలపడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఉత్తరాంధ్ర-ఒడిషా తీరంవైపు కదులుతోందని... దీని ప్రభావంతోనే తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. సెప్టెంబర్ 27 అంటే రేపు శనివారం ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు… కాబట్టి ఈ రెండుమూడు రోజులు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణను ఇప్పటికే వర్షాలు ముంచెత్తుతున్నాయి... ఇకపై కూడా ఇవి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణను ఇప్పట్లో వర్షాలు వదిలేలా కనిపించడంలేదు... దీంతో అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో ముందుస్తు జాగ్రత్తలు చేపట్టింది ప్రభుత్వం. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఊహకందని స్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయట... అందుకే ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక కొత్తగూడెం, హన్మకొండ, జనగాం, భూపాలనల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, ములుగు, మెదక్ , నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) September 26, 2025
భారీ వర్షాలతో సర్కార్ అలర్ట్
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని... ఆయా జిల్లాల్లో పరిస్థితులను కలెక్టర్లను అడిగి తెప్పించుకోవాలని సూచించారు. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, వాగుల దగ్గర్లోని ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని... నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించించారు.
హైదరాబాద్ లో భారీ వర్షాలు
హైదరాబాద్ విషయానికి వస్తే లోతట్టు ప్రాంతాలు, నాలాల పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని... ట్రాఫిక్ జామ్స్ జరక్కుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఇతర సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు.
తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఎక్కడంటే...
ఇక తెలంగాణవ్యాప్తంగా ఇవాళ ఉదయం నుండి జోరువానలు పడుతున్నాయి... ఇప్పటివరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 6.8 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇక గద్వాల జిల్లా ఐజలో 6.4, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 6.2 సెం.మీ, వనపర్తి జిల్లా ఆత్మకూరులో 6.2 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. అయితే ఇకపై కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి… ప్రమాదకరంగా ప్రవహించే నీటి ప్రవాహాలకు దూరంగా ఉండాలి.