TS Inter Supplementary Results : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (టీఎస్ బీఐఈ) ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుంది.

TS Inter Supplementary Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 7న (శుక్రవారం) విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ (టీఎస్ బీఐఈ) ప్రకటన విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుంది. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి 20 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ల‌ను రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షాకేంద్రాల్లో నిర్వ‌హించగా.. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ‌ర‌య్యారు.

దోస్త్‌, ఇంజ‌నీరింగ్, ఇత‌ర‌ ప్ర‌వేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను వీలైనంత త్వ‌ర‌గా విడుద‌ల‌ చేసేందుకు ఇంట‌ర్ బోర్డ్ అధికారులు కసరత్తు చేశారు. అన్ని అనుకున్న‌ట్టు కుదిరితే.. జూలై మొదటి వారం అంటే.. జూలై 7 న విడుదల కానున్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://tsbie.cgg.gov.in మరియు https://results.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు .


ఈ ఏడాది జ‌రిగిన ఇంట‌ర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో ప్రథమ సంవత్సరంలో 63.85 శాతం ఉత్తీర్ణ‌త‌ సాధించగా.. ద్వితీయ సంవత్సరంలో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఇంటర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 9,48,153 మంది హాజరయ్యారు.