కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెరుకు సుధాకర్‌ల మధ్య పంచాయితీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. 

హైదరాబాద్‌: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెరుకు సుధాకర్‌ల మధ్య పంచాయితీ తెలంగాణ హైకోర్టుకు చేరింది. చెరుకు సుధాకర్ కుమారుడికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనను బెదిరింపుకు గురిచేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెరుకు సుధాకర్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఫై హత్య ప్రయత్నం నేరం ప్రకారం కేసు నమోదు చేసి, వెంటనే ఆరెస్ట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అలాగే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నుంచి తనకు ప్రాణ హాని ఉందని కూడా చెరుకు సుధాకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే చెరుకు సుధాకర్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. 

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ నేత చెరుకు సుధాకర్‌, ఆయన కుమారుడు సుహాస్‌లను హత్య చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై నల్గొండ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సుహాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని సుహాస్ తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన తండ్రిని పరుష పదజాలంతో దూషించాడని చెప్పారు. తమని చంపేస్తామని బెదిరింపుకు పాల్పడ్డారని.. తన ఆస్పత్రికి కూల్చివేస్తామని కూడా అన్నారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు.