సిద్దిపేట:మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూ నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బినామీల పేర్లతో స్వాహా చేసేందుకు ప్రయత్నించిన వ్యవహరం వెలుగుచూసింది. సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే  సందీప్‌‌ ఈ వ్యవహరంలో కీలక పాత్ర పోషించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన రెండు చెక్కులు మాయమైనట్టుగా అధికారులు గుర్తించారు.మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు వెంటనే పరిహరం చెల్లించాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 పరిహరం చెల్లింపు కోసం గత మాసంలో 12 ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు పరిహరం చెల్లించారు. పరిహరం అందని బాధితుల భూములను రీ సర్వే నిర్వహించి ఆ తర్వాత  పరిహరం చెల్లించాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

నిర్వాసితులకు పరిహరం చెల్లింపులో జాప్యం  కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో  ఖాళీ చెక్కులపై సంతకాలు కూడ చేశారు అధికారులు.  అయితే సంతకాలు చేసిన చెక్కుల్లో రెండింటిని సందీప్, చాంద్ పాషా దొంగిలించారని అధికారులు గుర్తించారు.

ఈ ఏడాది జనవరి మాసంలో  దుద్దెడ బ్యాంకు నుండి చాంద్ పాషా రూ. 50 లక్షలను డ్రా చేశారు. కొన్ని రోజుల తర్వాత రూ. 2.60 కోట్లను డ్రా చేసేందుకు ప్రయత్నించాడు.

అయితే అంత మొత్తం ఆ బ్యాంకులో లేకపోవడంతో చాంద్ పాషా‌కు డబ్బులు రాలేదు. చాంద్ పాషాను ఉపయోగించుకొని సందీప్ఈ డబ్బులను డ్రా చేశారని  అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇదే సమయంలో  పరిహరం చెల్లింపుకు సంబంధించిన రెండు చెక్కులు మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఈ విషయమై సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.