హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.అక్రమ లేఔట్లలో రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై దాఖలైన  పిటిషన్ పై గురువారం నాడు తెలంగాణ హైకోర్టు విచారించింది.

అక్రమ లేఔట్లను క్రమబద్దీకరించుకొనేందుకు గాను ఈ ఏడాది ఆగష్టు 31 వ తేదీన తెలంగాణ ప్రభుత్వం  ఎల్ఆర్ఎస్  అమల్లోకి తెస్తూ 131 జీవోను జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని కూడ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెలవులు ఇచ్చింది.

also read:గుడ్‌న్యూస్: ఎల్ఆర్ఎస్ కి ఫీజు తగ్గింపు, 2015 జీవో ప్రకారంగా వసూలు

ఈ విషయమై దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 15కి వాయిదా వేసింది.

ఎల్ఆర్ఎస్ పూర్తి చేయని ప్లాట్లను రిజిస్ట్టేషన్ చేయకుండా నిలిపివేయడంతో రాష్ట్రంలో వందలాది ప్లాట్లు కొనుగోలు  చేసిన యజమానులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.ఎల్ఆర్ఎస్ చేయని ప్లాట్లకు కూడ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలు కూడ వ్యక్తం చేశారు. 

ఎల్ఆర్ఎస్ ఫీజు ఎక్కువగా ఉన్న విషయాన్ని విపక్షాలు చెప్పడంతో ప్రభుత్వం ఈ ఫీజులను సవరించింది. 2015లో జారీ చేసిన ఎల్ఆర్ఎస్ జీవో మేరకు ఫీజులను వసూలు చేయనున్నట్టుగా గత వారంలో సవరణ జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే.