హైదరాబాద్: కొత్త రెవిన్యూ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అందిన సాదా బైనామాల ధరఖాస్తులను పరిశీలించవద్దని తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సాదా బైనామాల క్రమబద్దీకరణపై బుధవారంనాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.కొత్త రెవిన్యూ చట్టం అమల్లోకి రాకముందు అందిన సాదాబైనామాల ధరఖాస్తులను పరిశీలించవచ్చని హైకోర్టు ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రద్దైన రెవిన్యూ చట్టం ప్రకారం భూములను ఎలా క్రమబద్దీకరిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల పాటు అడ్వకేట్ జనరల్ సమయం కోరాడు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ధరఖాస్తులను పరిశీలించవద్దని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

also read:ధరణి పోర్టల్‌‌లో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల నమోదు: కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు షాక్

కొత్త రెవిన్యూ చట్టం ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీ నుండి అమల్లోకి వస్తోందని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గత అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవిన్యూ బిల్లులు ఆమోదించారు. ఆ తర్వాత ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో మూడు బిల్లులు చట్టరూపంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే కొత్త రెవిన్యూ చట్టం అమల్లో భాగంగా ధరణి పోర్టల్ ప్రారంభించిన సమయంలో సాదా బైనామాలపై భూముల క్రమబద్దీకరణకు వారం రోజుల సమయం ఇస్తూ కేసీఆర్ ప్రకటించారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.