హైదరాబాద్: ధరణి పోర్టల్‌ లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీల వివరాల నమోదుపై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు స్టే ఇచ్చింది.ధరణి పోర్టల్ లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

ధరణి పోర్టల్ లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.భద్రతాపరమైన నిబంధనలు పాటించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని హైకోర్టు అభిప్రాయపడింది.

also read:దేశానికే ట్రెండ్ సెట్టర్: ధరణి పోర్టల్ ప్రారంభించిన కేసీఆర్

గూగుల్ ప్లే స్టోర్ లో ధరణి పోర్టల్ ను పోలిన మరో నాలుగు యాప్ లు ఉన్నాయని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది.అసలు ధరణి పోర్టల్ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బంది అవుతోందని హైకోర్టు అభిప్రాయపడింది.

ధరణి పోర్టల్ విషయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకొంటున్నారో తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.రెండు వారాల్లో కౌంటర్ ద్వారా పూర్తి నివేదిక సమర్పించాలని హైకోర్టు కోరింది. అప్పటివరకు ఎలాంటి వివరాలు నమోదు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

బలవంతంగా ప్రజల నుండి వివరాలు సేకరించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.ఇప్పటివరకు సేకరించినవారి సమాచారాన్ని ఎవరికి కూడ ఇవ్వొద్దని కోర్టు కోరింది. ఏ చట్టం ప్రకారంగా కులం, ఆధార్ వివరాలను సేకరిస్తున్నారని హైకోర్టు ప్రశ్నింంచింది.

వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని హైకోర్టు అడిగింది. డేటా దుర్వినియోగమైతే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం ఏర్పడుతోందని కోర్టు అభిప్రాయపడింది.
డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్టుగా హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపాడు.