ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టే పొడిగింపు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టేను తెలంగాణ హైకోర్టు మరికొంతకాలం పొడిగించింది
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, జగ్గుస్వామి సిట్ నోటీసులపై స్టేను తెలంగాణ హైకోర్టు మరికొంతకాలం పొడిగించింది. ఈ నెల 22 వరకు స్టే పొడిగిస్తూ న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపోతే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితులు సింహయాజీ, రామచంద్ర భారతి, నందకుమార్‌లకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో.. సింహయాజీ గత బుధవారం చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఇద్దరు నిందితులకు ఏసీబీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిద్దరూ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే వీరు విడుదలైన వెంటనే వారిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.
బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో రామచంద్ర భారతి, నందకుమార్‌లపై నమోదైన వేర్వేరు కేసులకు సంబంధించి వారిని అదుపులోకి తీసుకున్నారు. నందకుమార్‌పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో నమోదైన చీటింగ్, ఫోర్జరీ కేసుల్లో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 1న బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు ఒక్కొక్కరు రూ. 3లక్షల చొప్పున పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య సిట్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. అయితే కోర్టు నిర్దేశించిన విధంగా నిందితులు రూ. 3 లక్షల పూచీకత్తు, ఇద్దరు పూచీకత్తులను అందించడంలో జాప్యం కారణంగా వారు ఇన్ని రోజులు విడుదల కాలేదు. అయితే షరతులకు అనుగుణంగా పూచీకత్తు సమర్పించడంతో నిందితులకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.