ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు.. హైకోర్టులో సిట్ రివిజన్ పిటిషన్.. ఏసీబీ కోర్టు పరిధి దాటి వ్యవహరించిందన్న ఏజీ!

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీజేపీ సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొనాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

SIT Revision petition in Telangana High court Over ACB Court Orders in TRS MLAs Poaching Case

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీజేపీ సీనియర్‌ నేత బీఎల్‌ సంతోష్‌తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొనాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సిట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే సిట్ రివిజన్ పిటిషన్‌ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. ఏసీబీ  కోర్టు పరిధి దాటి వ్యవహరించిందన్నారు. 

మెమో రిజెక్ట్ చేసే అధికారం ఏసీబీ కోర్టుకు ఉన్నప్పటికీ.. కోర్టు ఇచ్చిన ఆర్డర్ క్వాష్ పిటిషన్ ఆర్డర్‌లా ఉందని అడ్వకేట్ జనరల్ అన్నారు. మరోవైపు ప్రతివాదుల తరపున న్యాయవాది ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను సమర్థించారు. ఈ క్రమంలోనే రివిజన్ పిటిషన్‌ కాపీని ప్రతివాదులకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. 

ఇక, ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజి, నందు కుమార్‌లు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరికి తెలంగాణ హైకోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసును విచారిస్తున్న సిట్.. విచారణ నిమిత్తం పలువురికి నోటీసులు జారీ చేసింది. అయితే దర్యాప్తుల ఆధారంగా.. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్‌తో పాటు కేరళకు చెందిన  తుషార్ వెల్లపల్లి, జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బి శ్రీనివాస్‌లను కూడా నిందితులుగా గుర్తించేందుకు అభ్యర్థిస్తూ సిట్ కోర్టులో గత నెలలో మెమో దాఖలు చేసింది. 

అయితే సిట్‌ దాఖలు చేసిన మెమోపై వాదనలు విన్న అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు దానిని తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంకు సంబంధించిన నేరాలపై దర్యాప్తు చేయడానికి లా అండ్ ఆర్డర్ పోలీసులకు లేదా ప్రత్యేక దర్యాప్తు బృందానికి అధికారం లేదని, ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ అవినీతి నిరోధక బ్యూరో మాత్రమే దర్యాప్తు చేయడానికి సమర్థ అధికారం కలిగి ఉందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios