హైదరాబాద్: మొహర్రం సందర్భంగా ఊరేగింపునకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మొహర్రం ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని ఫాతిమా సేవాదళ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై బుధవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. పాతబస్తీలోని డబీర్ పురా బీబీకాఆలం నుండి చాదర్ ఘాట్ వరకు ర్యాలీకి అనుమతి ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు అనుమతిని నిరాకరించింది.

ఈ తరహా ర్యాలీలకు సుప్రీంకోర్టు కూడ నిరాకరించిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు ప్రస్తావించింది.  ఈ నెల 30వ తేదీన మొహర్రం ఉన్నందున ఈ ర్యాలీకి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్.

కరోనా నేపథ్యంలో వినాయకచవివి, మొహర్రం లాంటి పండుగలను కూడ ఇండ్ల వద్దే నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. గణేష్ మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 

వినాయకచవితి వేడుకల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిరసనలు చేపట్టింది.