హైదరాబాద్: సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు  రాయలసీమ ఎత్తిపోతల పథకం  (పోతిరెడ్డిపాడు) ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్ పై విచారణను నిరవధికంగా వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ప్రారంభించింది.  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్  లో పిటిషన్లు ఉన్నాయి. 

రెండు రాష్ట్రాల జలవివాదాలు తమ పరిధిలోకి ఎలా వస్తాయని సోమవారం నాడు జరిగిన విచారణలో హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ హైకోర్టుకు  ఈ పిటిషన్ పై విచారణ పరిధి ఉంటుందని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావు ఈ సందర్భంగా చెప్పారు.


సుప్రీంకోర్టు, ఎన్ జీటీలో  పిటిషన్లు పెండింగ్ లో ఉండగా తాము ఎలా జోక్యం చేసుకోవాలన్న హైకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండానే పనులు చేపడుతోందని తెలంగాణ అడ్వకేట్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

సుప్రీంకోర్టులో నదీ జలాల కేటాయింపు అంశంపై పిటిషన్ ఉందని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తాము ఎలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు ప్రశ్నించింది.

డీపీఆర్ సమర్పించి టెండర్లకు వెళ్లేందుకు ఏపీకి ఎన్ జీటీ అనుమతిచిందన్న పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ జీటీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదన్న హైకోర్టు ప్రశ్నించింది. 

ఎన్ జీటీకి విచారణ పరిధి లేదని చెప్పినట్టుగా  తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. విచారణ పరిధి పై ముందు ఎన్జీటీ తేల్చాలన్న హైకోర్టు అభిప్రాయపడింది. పిటిషన్ లోని అన్ని అంశాలు సుప్రీంకోర్టు ముందున్నాయన్న ఏపీ  ప్రభుత్వ అడ్వకేట్ జనరల్  శ్రీరాం చెప్పారు.

also read:రాయలసీమ ఎత్తిపోతల పథకం పై సుప్రీంకు వెళ్లండి: పిటిషనర్లకు హైకోర్టు సూచన


సుప్రీంకోర్టు విచారణ పూర్తయ్యే వరకు విచారణను నిలిపివేయాలని ఏపీ అడ్వకేట్ జనరల్ కోరారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు  విచారణను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు ప్రకటించింది. సుప్రీంకోర్టులో తేలిన తర్వాత తమ దృష్టికి తీసుకు రావచ్చునని పిటిషనర్లకు  హైకోర్టు. సూచించింది.