హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు పిటిషనర్లకు సూచించింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి, సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్టు విచారణ చేసింది.

రెండు రాష్ట్రాల మధ్య జలవివాదమైనందున సుప్రీంకోర్టుకు వెళ్లాలని  పిటిషనర్లకు తెలంగాణ హైకోర్టు సూచించింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి విరుద్దంగా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని పిటిషనర్ల తరపున న్యాయవాది శ్రవణ్ పేర్కొన్నారు.  

రెండు రాష్ట్రాల జలవివాదాలు హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టుకే వెళ్లాలని సూచించింది. దీంతో పిటిషనర్లతో ఈ విషయాన్ని చర్చించి చెబుతామని హైకోర్టుకు పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రవణ్ కుమార్ చెప్పారు. దీంతో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టునిర్మాణం పూర్తైతే తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.ఇదే విషయమై సుప్రీంకోర్టులో కూడ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.