Hyderabad : 'భారత స్వతంత్ర వజ్రోత్సవాల'లో భాగంగా పక్షం రోజుల పాటు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించింది.  

Independence Day celebrations: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆగస్టు 15న గోల్కొండ కోటలో జెండాను ఎగురవేయనున్నారు. 'భారత స్వతంత్ర వజ్రోత్సవాల'లో భాగంగా పక్షం రోజుల పాటు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించింది. వివ‌రాల్లోకెళ్తే.. స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నివేదికతో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికను అనుసరించి, జంట నగరాల్లోని అన్ని ప్రధాన దేవాలయాలు, మసీదులు, పర్యాటక ప్రాంతాలు, శంషాబాద్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు స‌హా ఇతర రద్దీ ప్రదేశాలలో భద్రతను కూడా పెంచారు.

అన్ని బహిరంగ ప్రదేశాలు, హోటళ్ల వద్ద పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు, రాజ‌ధాని హైద‌రాబాద్ లో నెల‌కొన్న ప‌రిస్థితులు పర్యవేక్షించడానికి ఇతర ప్రదేశాలలో అదనపు బలగాలను మోహరించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వ అధికారులు 75వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు ఉదయం గోల‌కొండ కోట వద్ద పరేడ్ రిహార్సల్ కూడా జరిగింది. ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గోలుకొండ‌ కోటపై జెండాను ఎగురవేయనున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆయన ప్రతి సంవత్సరం గోలుకొండ‌ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు. అయితే, మహమ్మారి సమయంలో, సీఎం తన అధికారిక క్యాంపు కార్యాలయం-కమ్-రెసిడెన్స్ అయిన ప్రగతి భవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కాగా, ప్ర‌స్తుతం గోలుకొండ కోట త్రివ‌ర్ణ రంగుల‌తో ముస్తాబైంది. 

భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం.. 

ఆగస్టు 15, 2022న భారతదేశం తన స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోంది. ఈ కార్యక్రమానికి 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' అని పేరు పెట్టారు. దీనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగా' అనే ప్రచారాన్ని కూడా నిర్వహిస్తోంది. ఇందులో 20×30 అంగుళాల జాతీయ జెండాలు ప్రతి ఇంటికి రూ. 25ల‌కు అందిస్తోంది. 

Scroll to load tweet…

'భారత స్వతంత్ర వజ్రోత్సవాల'లో భాగంగా పక్షం రోజుల పాటు జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సమావేశం నిర్వ‌హించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు/పోలీసు సూపరింటెండెంట్లు, డీఈఓలు, మున్సిపల్ అధికారులతో మాట్లాడి రాబోయే వారాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 500కి పైగా థియేటర్లలో ప్రదర్శింపబడిన “గాంధీ” చిత్రాన్ని ఈరోజు 2.2 లక్షల మంది పాఠశాల విద్యార్థులు చూశారని ప్రధాన కార్యదర్శి తెలిపారు. 16న పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా జాతీయ గీతాలాపనను నిర్వహించనున్నారు. అదేవిధంగా 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీ, మండలం, మున్సిపాలిటీ, జిల్లాకేంద్రాల్లో ఫ్రీడమ్‌కప్‌ క్రీడాపోటీలు నిర్వహించి యువత, అన్ని వర్గాల ప్రజలు అత్యధికంగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటామన్నారు.